Thursday, December 5, 2024

కొన్నిసార్లు శాపాలు కూడా వరాలవుతాయి అది ఎలాగో చందమామ కథ ద్వారా తెలుసుకుందాం.?

నారద వర్తమాన సమాచారం

కొన్నిసార్లు శాపాలు కూడా వరాలవుతాయి అది ఎలాగో చందమామ కథ ద్వారా తెలుసుకుందాం.

ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం; రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి.
ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాముపొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,” అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,” అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు.

గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది, ‘‘ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం!” అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, ‘‘తల్లీ, నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి, చీకటి పడేసరికి, ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు,” అన్నాడు. ‘‘నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు,” అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు.

ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక, పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, ‘‘నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను,” అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత, అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి, అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి, పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి; రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు.

మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత, ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి, ‘‘తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,” అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, ‘‘మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితేతప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం,” అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి, నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని, ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే, ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే, నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలుజరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి, ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది.

మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ, మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, ‘‘తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే, ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను,” అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, ‘‘మూర్ఖుడా, ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!” అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.

సేకరణ: నారద వర్తమాన సమాచారం


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading