అసలు కుర్చీ మడత పెట్టడమంటే ఇదే!
నారద వర్తమాన సమాచారం :తెలంగాణ:ప్రతినిధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ మడత పెట్టి పార్టీ గేట్లు ఎత్తేశారు! అసలు అంతకు ముందు ఆయన లో వున్న ఆ టెంపర్, ఆ పవర్ చూసి మహా నాయకులు వాడేసుకున్నారు కానీ, ఒక మంత్రి పదవి లేదా ఒక కార్పొరేషన్ పదవి మచ్చుకు కూడా ఇవ్వలేదు! ఇంచుమించు 20 ఏళ్ల రాజకీయ అనుభవం లో ఏమాత్రం పదవులు అందుకోకుండా ముఖ్యమంత్రి అయిన చరిత్ర రేవంత్ రెడ్డిదే! పైగా మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఓటు శాతం లేని నేతలు సైతం అప్పుడప్పుడు పేపర్ పులులై గాండ్రిస్తు ఉంటారు! ఆ గాండ్రింపు బిఆర్ఎస్, టీడీపీ లో వినిపించే అరుపులు కాదు! సీటు మడత పెట్టేస్తారేమో అన్నంత భీకర శబ్దం తో కూడి ఉంటుంది!
అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టిపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టి ఉరుములు ఉరిమించినా, పిడుగులు పడేసినా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కుర్చీ అతనిదే అని ఎవరూ పెద్దగా ఊహించలేదు! ఊహకు కూడా రాలేదు! ఆ మహా సముద్రంలో బోలెడు తిమింగలాలు ఉన్నాయి, ఈ చిన్న కొర్రమీనుకు కుర్చీ ఎవరిస్తారు ఎందుకిస్తారు అనుకున్నాం కానీ, పార్టీని గెలిపించి హైదరాబాద్ లోనే ఉండి ముఖ్యమంత్రి అని ఢిల్లీలో ప్రకటన వచ్చేలా చేసి తన తడాఖా చూపించాడు! పరిపాలన అనుభవం లేకున్నా వంద రోజుల పాలనతో భరోసా ఇచ్చాడు!
అటు అసెంబ్లీ లో, ఇటు బయట కూడా “కుర్చీ ముచ్చట మూన్నాళ్ళే” అంటూ రెచ్చగొట్టడాలు, రెచ్చిపోవడాలు మొదలయ్యాయి! కడియం శ్రీహరి, కె. కేశవరావు లాంటి వాళ్ళకు కూడా మింగుడు పడలేని రాజకీయం అది! మన ముందు వచ్చి కింగ్ అయిపోయాడనే మాట వీళ్లనే కాదు టీడీపీ, కాంగ్రెస్, బిజెపి, బిఅర్ఎస్ లాంటి అన్ని పార్టీల్లోను హాట్ హాట్ చర్చ! అయినా 99 రోజులు తట్టుకుని వందో రోజు తొలి గేటు ఎత్తేశాను అని ఏకంగా మీడియా మీట్ లో ప్రకటించడం ఏదయితే ఉందో దాన్నే కుర్చీ మడత పెట్టి… అనొచ్చు! అక్కడ చేరిన మీడియా ప్రతినిధులకు అ సమావేశం ముగిసిన తరువాత గానీ తెలియలేదు! ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపి రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి మరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా మీట్ కు వచ్చారని తెలిసి అవాక్కయ్యారు!
గత తొమ్మిదిన్నరేళ్లు అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడుంటే అక్కడే పక్కన కుర్చీలో కూర్చుని కనిపించే మేధావి సీనియర్ నేత, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె. కేశవరావు మళ్ళీ కాంగ్రెస్ కు వస్తారని ఎవరైనా ఊహించారా? 84 ఏళ్ల వయసులో ఆయన అలా ఎందుకు చేస్తారని అనుకుంటాం! ఆయన కుమార్తె విజయలక్ష్మి ని హైదరాబాద్ మేయర్ చేసినా, ఎనిమిది పదుల వయసులో ఆయన్ని రాజ్యసభకు పంపించినా, ఫార్మ్ హౌస్ ముచ్చట్లలో ఆయనకే ప్రధాన కుర్చీ ఇచ్చినా ఆయన మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డిని కలిశారు! కలిసే ముందు అందరిలా ఏదో రాజీనామా లేఖ కాకుండా నేరుగా కెసిఆర్ కే చెప్పి నేను వెళుతున్న అని ప్రకటించారు. “ఎవరు వెళ్లినా ఓకే కానీ, నీకేం తక్కువ చేశాను” అని కెసిఆర్ అసహనం వ్యక్తం చేసినా వినలేదు! అది కెకె రాజకీయం! “కాంగ్రెస్ లో ఎదిగాను, ఇక కాంగ్రెస్ లోనే చనిపోతాను” అంటూ సోనియా గాంధీతో మాట్లాడి లైన్ క్లియర్ చేసుకున్నా, దీని వెనుక స్కెచ్ అంతా రేవంత్ రెడ్డి దే అని వేరేగా చెప్పక్కరలేదు! కుర్చీ మడత పెట్టి కొట్టడమంటే ఇలాగే ఉంటుంది!
ఇక కడియం శ్రీహరి సీనియర్ రాజకీయ దిగ్గజం! అసెంబ్లీలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంలో మాట్లాడేది, ఢీ అంటే ఢీ అనేది ముగ్గురే! ఒకరు కడియం శ్రీహరి, రెండు కేటీఆర్, మూడు హరీష్ రావు! ఇందులో ముందు శ్రీహరి కుర్చీ మడత పెట్టాలి! మడత పడే రకం కాదు! అయినా మడత పెట్టేశారు! కుమార్తె కావ్య కు వరంగల్ ఎంపి సీటు కెసిఆర్ కేటాయించిన తరువాత మడత పెట్టడం అంత ఈజీ కాదు! అయినా రేవంత్ రెడ్డి మడత పెట్టి తన మార్క్ చూపించారు. శ్రీహరి, కావ్య ఇద్దరూ బై చెప్పేసారు, రేపు కాంగ్రెస్ కండువా కప్పుకుని వరంగల్ నుంచే పోటీకి సిద్ధం అవుతున్నారు! ఇది కదా కుర్చీ మడత పెట్టడమంటే!
ఈ లెక్కన చూస్తుంటే ఈ ఎన్నికల లోపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది! పైగా అక్కడ అన్ని గేట్లు ఎత్తి కుర్చీ మడత పెట్టి సిద్ధంగా ఉన్నారు! చూద్దాం ఏం జరుగుతుందో!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.