నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
క్రీస్తు మరణం శుభశుక్రవారం (గుడ్ ఫ్రైడే) ఎలా అయ్యింది …?
ఆయన మరణంలో ఉన్న సందేశం ఏంటి?
✍️ గన్నవరం ఏలియ. 9392231959.
అనంతమైన ప్రేమకు సంకేతం గుడ్ ఫ్రైడే.. గుడ్ ఫ్రెడే అంటే శుభశుక్రవారం. ఈరోజున క్రీస్తు యేసు తన ఆత్మను సమర్పించారు. మానవాళిని వారి పాపాల నుంచి క్రీస్తు విముక్తి చేసిన రోజు కాబట్టి ఆ రోజును విమోచన దినంగా, శుభ శుక్రవారంగా క్రైస్తవ సోదరులు పాటిస్తారు. అయితే క్రీస్తు మరణించడం శుభం ఎలా అవుతుంది అన్న సందేహం చాలామందికి వస్తుంది… క్రీస్తు మరణించిన రోజున గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారో తప్పకుండా తెలుసుకోవాల్సిందే.
దేవుని ప్రణాళిక
క్రీస్తు జననం, సిలువ మరణం, పునరుత్థానం దేవుని ప్రణాళిక.
నరుడు మంచి మనిషిగా బ్రతకాలని దేవుని కోరిక. ఆయన కరుణామయుడు, ప్రేమమూర్తి కాబట్టి నశించిన మానవజాతిని రక్షించడానికి తానే నరరూపధారిగా భూమియందు అవతరించి వారిని పాపాల నుంచి విడిపించడానికి దేవుడు రచించిన ప్రణాళికే క్రీస్తు జననం, సిలువ మరణం, పునరుత్థానం. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. క్రీస్తు అంటే పాపులను రక్షించడానికి అభిషేకింపబడినవాడని అర్థం. రెండువేల సంవత్సరాలకు పూర్వం ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ మూలంగా కన్య మరియ గర్భమందు మానవుడిగా జన్మించాడు. ఈ భూతలంపై ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు దైవవాక్యాన్ని బోధించాడు.
అద్భుత కార్యాలు చేసిన క్రీస్తు
క్రీస్తు యేసు ప్రేమను గూర్చి, మంచి చెడులను గూర్చి బోధిస్తూ పలు అద్భుత కార్యాలు చేయసాగాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు.గుడ్డివారికి చూపును రప్పించాడు. కుంటివారికి నడకనిచ్చాడు. చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించాడు. అయిదు రొట్టెలు, రెండు చేపలతో అయిదువేల మందికి సమృద్ధిగా ఆహారం పెట్టాడు. సముద్రంలో తుఫానులను నెమ్మదింపచేశాడు. ఇలా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. తాను దైవ కుమారుడినని, ఈ లోకంలో ప్రేమ, శాంతి, న్యాయం గల రాజ్యాన్ని స్థాపిస్తానని ప్రకటించాడు.
శుభశుక్రవారం అని ఎందుకు పిలుస్తారు..
శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆయనను శిలువపై వేలాడదీశారు. ఎంతో బాధ అనుభవించిన ఆయన ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఆత్మను సమర్పించారు. మానవాళిని వారి పాపాల నుంచి క్రీస్తు విముక్తి చేసిన రోజు కాబట్టి ఆ రోజును విమోచన దినంగా, శుభ శుక్రవారంగా క్రైస్తవ సోదరులు పాటిస్తారు.ఆ రోజు ఆయన శిలువపై చెప్పిన మాటలను స్మరిస్తూ ప్రార్థనలో గడుపుతారు. కొందరు ఉపవాసం ఉంటారు. క్రీస్తు శుక్రవారం రోజు పరమపదించి తిరిగి మూడో రోజు అంటే ఆదివారం నాడు పునరుత్తానం చెందారు.
హింసను అహింసతోనే జయించగలమని చాటిన ఏసుక్రీస్తు
నేటికీ ప్రపంచంలో కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఆటవిక నీతి సమాజంలో కొనసాగుతోంది. కానీ చెడుపై మంచి ద్వారానే విజయం సాధించగలం. అలాగే హింసను అహింసతోనే జయించగలం, ద్వేషాన్ని దైవికమైన ప్రేమతోనే అధిగమించగలం అని ఏసు ఆచరణలో చూపించాడు. ఏసు తన అద్భుతమైన ప్రేమతో తనను హింసించే వారిని క్షమించడం ద్వారా ఈ సత్యాలను ఆవిష్కరించాడు.యేసు ప్రపంచనికి ప్రేమమార్గాన్ని అందించాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.