ప్రస్తుత రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
నారద వర్తమాన సమాచారం :దిల్లీ: ప్రతినిధి
దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని ఆరోపించారు..
ఈ మేరకు ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది చర్చనీయాంశంగా మారింది.
”పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్‌లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నాయి. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించడం, రాత్రి మీడియాతో న్యాయమూర్తులను ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధాకరం” అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
”రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లే. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం” అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.