నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్.. పొంచి ఉన్న తాగునీటి గండం!
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది.
తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న నాగార్జునసాగర్ తీవ్ర వర్షాభావంతో వట్టి పోయింది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక సాగర్ నిండుకుంటోంది. దీంతో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్, రబీ సీజన్ లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. మరోవైపు వేసవి కాలం ప్రారంభం కావడంతో సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నీటి మంచినీటి ఎద్దడి తీవ్రమవుతోంది.
డెడ్ స్టోరేజ్‌కి చేరుకున్న నీటి మట్టం..
590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 511 అడుగుల నీటిమట్టంతో 133.7 టీఎంసీల నీరు ఉంది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు 131 టీఎంసిలుగా నిర్ణయించడం జరిగింది. అయితే డెడ్ స్టోరేజ్ కి కేవలం మూడు అడుగుల దూరంలోనే ఉంది సాగర్ డ్యామ్. దీంతో నాగార్జునసాగర్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 528.30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాదితో పోల్చితే నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో 31 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది.
తాగునీటికి కటకట…
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుండి హైదరాబాద్ జంట నగరాలు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రెండు మోటార్లతో 900 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్ కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది.
ప్రస్తుతం నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో తాగునీటికి ప్రమాదం పొంచి ఉంది. సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. డెడ్ స్టోరేజీకి ఎగువన ఉన్న కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం అయితే ఏప్రిల్ నెల వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్లలో తాగునీటికి సరిపడా నీరు ఉంది. మే, జూన్, జూలై మూడు నెలలకు తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితి ఉంది.
జీరో లెవల్ నుంచి పుట్టంగండి వద్ద పంపింగ్
హైదరాబాద్ జంట నగరాలకు మంచినీటి సరఫరాను ప్రస్తుతం పుట్టంగండి ఎత్తిపోతల పథకం ద్వారా జరుగుతోంది. 510 అడుగుల డెడ్ స్టోరీకి దిగవకు నీటిమట్టం పడిపోతే పంపింగ్ కష్టమే అవుతుంది. నీటి మట్టాలు 510 అడుగుల దిగువనకు చేరినప్పుడు బ్యాక్ వాటర్ వద్ద జీరో పాయింట్ నుంచి డ్రెడ్జింగ్ ప్రక్రియతో భారీ మోటార్లతో పంపింగ్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు 1450 కోట్ల రూపాయలతో సుంకిశాల వద్ద మూడోదశ పైపు పనులు కూడా కొనసాగుతున్నాయి. మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అత్యవసర పనులను చేపడుతున్నారు.
మరోవైపు ఏపీ తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో రెండు రోజుల్లో డెడ్ స్టోరేజ్ కి చేరుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్ అవసరాలకు శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పటికే ఆ రెండు ప్రాజెక్టులు వట్టిపోయి ఉన్నాయి. మరో మూడు నెలల పాటు తాగునీటి అవసరాలు ఎలా తీర్చుకోవాలని దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
డెడ్ లెవెల్‌కు చేరువలో శ్రీశైలం జలాశయం
అటు నంద్యాల జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సాగు త్రాగునీరందించే శ్రీశైలం జలాశయం ఇప్పుడు నీటి నిల్వలు తగ్గిపోయి వెలవెలబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవసరమైన 215 టీఎంసీలకు గాను.. ఇప్పుడు మిగిలింది 34 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఎండాకాల సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలసిన పరస్థితి ఏర్పడనుంది.
శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు
శ్రీశైలం జలాశయంలో గత ఏడాది ఏప్రిల్ 8 ఇదే సమయానికి 805.80 అడుగులుగా 31.9380 టీఎంసీ నీరు ఉంది. అయితే ప్రస్తుతం నీటిమట్టం 810.70 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుతం 809.90 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామార్ద్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34.2438 టీఎంసీలుగా నమోదైంది. అయితే శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.