నారద వర్తమాన సమాచారం
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం లో వెలసియున్న
అల్లాడుపల్లె
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం
కడప జిల్లా : అల్లాడుపల్లె
శ్రీ వీరభద్ర స్వామి క్షేత్రం
కడప జిల్లాలో పేరుగాంచిన వీరభద్రక్షేత్రం అల్లాడుపల్లె. ఇక్కడి వీరభద్ర మూర్తిని తపోనిధి అయిన మహర్షి(వీరబ్రహ్మేంద్ర స్వామి)చే ప్రతిష్టితమై మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
వీరబ్రహ్మంగారు స్వయంగా ఇక్కడి శ్రీ వీరభద్రదస్వామినే గురువుగా భావించినందువల్ల బ్రహ్మంగారి మఠాధిపతులకు ఇది గురుపీఠమైంది.
నేటికీ బ్రహ్మంగారి మఠంలో జరిగే ప్రతి పూజోత్సవ కార్యక్రమానికి ముందు అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామికి పూజలు నిర్వహిస్తారు.
శ్రీ స్వామివారు రౌద్రమూర్తి అవటం వల్ల నాభి స్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని వుండడం వల్ల గర్భవతులైన స్త్రీలు స్వామివారిని దర్శించకూడదనే నియమం ఆలయ ప్రాంగణంలో ఉంది.
అల్లాడుపల్లె సమీపంలోని కుందూ నదికి వచ్చే వరదల కారణంగా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ కష్టాలతో అల్లాడుతూ ఉండినందున అ గ్రామానికి ” అల్లాడుపల్లె ” అని పేరు వచ్చిందని కొందరు చెప్తారు.
” ఆలు” అంటే ఆవులు, పశువులు అనీ, ఆడుట అంటే తిరుగుట అనీ అర్థం.
ఈ ప్రాంతపు బయళ్లలో మేతకోసం ఆవులూ, పశువులూ తిరుగుతూ ఉండినందున ఈ పల్లె ” ఆలాడుపల్లె ” గా ప్రసిద్ధమైందనీ, క్రమక్రమంగా అదే ” అల్లాడుపల్లె ” గా మారిందనీ కూడా చెప్తారు.
స్థల పురాణం
కాలజ్ఞానకర్త, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తన 12 వ ఏటనే కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మగారింట్లో పశులకాపరిగా చేరారు. తాను గీసిన గిరిలో పశువులు మేస్తుండగా , బ్రహ్మంగారు శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని మలిచారు. తన మనసులో ఆ వీరభద్రున్నే గురువుగా తలచుకొన్నారు. జ్ఞానిగా మారి గుహలో కూర్చుని కాలజ్ఞాన రచన చేశారు.
వరదలకు కుందూలో ప్రవేశించిన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం అల్లాడుపల్లె సమీపంలోని మడుగులోకి చేరింది. ఆ మడుగు సమీపంలో కేతవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పిల్లలు తమ పశువులను కుందూనది ఒడ్డున మేపుకుంటూ , నదిలో ఈత ఆడేవారు. అక్కడి మడుగులోకి చేరిన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం బాలునిగా మారి ఆ పిల్లల ఆటల్లో కలిసి పోయేవారు.
ఆ పిల్లలు తెచ్చుకున్న సద్ది మూటలను భుజించేవారు. ఆటలలో తానే పైచేయి అవుతూ, ఆ పిల్లలను కొట్టడం, బెదిరించడం చేసి, తాను వీరభద్రస్వామిననీ, తనను ప్రతిష్టించి పూజించాలనీ, తాను నదినుండి ఫలానా దినాన వెలువడుతాననీ, చెప్పి నదిలో దూకి స్వామి అదృశ్యమౌతారు
విగ్రహ రూపంలో తేలిన స్వామికి పూజలు జరిపారు. తరువాత స్వామి విగ్రహాన్ని ఒక బండిపైకి ఎక్కించి ఊరేగింపుగా ముందుకు కదిలారు. ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటికి బండి చేరుకోగానే బరువెక్కి కదలకుండా నిలిచిపోయింది. చేసేదేమీలేక ప్రజలు స్వామి వారిని అక్కడనే ఉంచి భోజనముల కోసమని కేతవరం గ్రామానికి వెళ్లిపోగా, వారి వెంట వచ్చిన వడ్రంగి పిచ్చివీరయ్య వీరభద్రస్వామి విగ్రహం దగ్గరే ఉండి పోయాడు. ఆ పిచ్చివీరయ్య ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి.
వీరబ్రహ్మంగారు సమాధి నిష్టతో ” ఓం నమోభగవతే వీరభద్రాయ ” అనే మూలమంత్రాన్ని జపించగానే, ఆ మంత్రోచ్ఛారణతో శ్రీ వీరభద్రస్వామి తానే స్వయంగా ఉత్తరాభిముఖుడై ప్రతిష్టితులయ్యారు. గ్రామప్రజలు శ్రీవీరభద్రస్వామి ప్రతిష్టితులై ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయి, తాము పిచ్చివాడుగా భావించే వీరయ్యే , వీరబ్రహ్మేంద్రస్వామిగా తెలుసుకున్నారు.
శ్రీవీరభద్రస్వామివారి దివ్యమూర్తి జీవకళ ఉట్టిపడే 6 అడుగుల నిండైన గంభీర విగ్రహం. స్వామివారి మూర్తి నల్లరాతి శిల్పము. రౌద్రమూర్తి కిరీటము, తలపై శివలింగం, నొసటమూడుపట్టెలు, త్రినేత్రాలు, శిరముపై కలశము, ఉరమున హారాదిభూషణాలు, యజ్ఞోపవీతము,సుదీర్ఘమైన కపాలమాల, కుడిచేతిలో ఎత్తిన ఖడ్గం, నాభిస్థానానికి కాస్త కింద భద్రకాళి ముఖాకృతి, నడుమున ఒరలో పిడిబాకులు, కాళ్లకు మంజీరాలతో స్వామివారి విగ్రహము రౌద్రముగ ఉంటుంది. శిరముపై కలశమున్నట్టు విగ్రహంలోనే మలచబడి ఉంది.
బ్రహ్మంగారు ప్రతిష్టించిన నాటినుండీ ఇప్పటిదాకా 400 సంవత్సరాలుగా శ్రీ వీరభద్రస్వామికి పూజా, పురస్కారోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూనే ఉన్నాయి.
శ్రీ వీరభద్రస్వామికి రుద్రునికి వలే సోమవారాలు ప్రశస్తమైనవిగా భావిస్తారు.
మహాశివరాత్రినాడు స్వామివారికి రుద్రాభిషేకము, క్షీరాభిషేకము, అష్టోత్తర శతనామ పూజ నిర్వహిస్తారు.
శివరాత్రి నాడు పార్వతీ కళ్యాణం కూడా జరుగుతుంది
సంతానం లేని స్త్రీలు చేతులలో కొబ్బరికాయలతో స్వామివారి ఎదుట సాష్టాంగ దండ ప్రమాణంగా , నేలపై సాగిలపడి వరపడితే సంతానం కలుగుతుందనీ భక్తుల నమ్మకం.
ఆ విధంగా సంతానం పొందిన వారితో పాటు ఈ ప్రాంతంలో చాలా మంది తమ పేరులో ” వీర ” శబ్దమును చేర్చుకుంటారు.
శివాంశంతో అవతరించడం వలన ఆయనకి ఎంతో ఇష్టమైన పులిహోర, పొంగలి, శనగలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
కడప జిల్లాలో మైదుకూరు పట్టణానికి సుమారు 5 కిమీ దూరం.
సేకరణ
పొన్నెకంటి శ్రీనివాసాచారి
సీనియర్ జర్నలిస్టు
8639884672
Discover more from
Subscribe to get the latest posts sent to your email.