
నారద వర్తమాన సమాచారం
జనసేన గుర్తు గాజు గ్లాసుపై వైకాపా కుట్రలు మానుకోవాలి: ప్రత్తిపాటి
ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
ఓటమి భయంతో రోజురోజుకీ దిగజారిపోతున్న అధికార వైసీపీ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై చేస్తోన్న కుట్రలు ఇకనైనా మానుకోవాలన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్య ర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ప్రభంజనంలా వస్తోన్న తెలుగుదేశం కూటమి ఓట్లు చీల్చేందుకే వైకాపా తన అధికార బలాన్ని ఉపయోగించుకుని ఈ కుతంత్రాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జనసేన పోటీలో లేనిచోట గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా పెట్టి స్వతంత్రులకు కేటాయించాలన్న ఈసీ నిర్ణయం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారాయన. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీలోకి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వందలమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి వీడ్కోలు పలికి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. మంగళవారం చిలకలూరిపేట పసుమర్రుకు చెందిన 20 కుటుంబాలు, 38వ వార్డుకు చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయి. వీరంతా ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. పసుమర్రు నుంచి జానీ, 38వ వార్డు నుంచి జంగా వినాయకరావు ఆధ్వర్యంలో ఈ చేరికల జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. అందుకే వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నచోట కావాలనే ఓట్లు చీల్చడానికి వైకాపా కుట్రలు చేసిందన్నారు ప్రత్తిపాటి. 50కి పైగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో చిన్నచిన్న పార్టీలకు గాజు గుర్తును కేటాయించడాన్ని పున:సమీక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.