![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/img-20240505-wa04748583907433501067412-300x170.jpg?resize=300%2C170&ssl=1)
నద వర్తమాన సమాచారం
మంచిర్యాల:
రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం ఆగమైందని విమర్శించారు. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా మంచిర్యాలలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారాస పాలనలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. సాగు మోటార్లు కాలిపోతున్నాయన్నా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మళ్లీ ఆగస్టు 15కి వాయిదా వేశారని ఎద్దేవా చేశారు.
గతంలో ఇచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు వచ్చాయన్నారు. ‘‘ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజే జిల్లాలు రద్దు చేస్తామని అన్నారు.
మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి. ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడుతారు. వరిపంటకు రూ.500 బోనస్ నిలిచిపోయింది. కల్యాణ లక్ష్మి చెక్కులు లేవు. కేసీఆర్ కిట్లు లేవు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లేవు. కొత్త మెడికల్ కళాశాలలకు పర్మిషన్లు రావడం లేదు. ఇలా అన్ని రంగాల్లోనూ గత ఐదు నెలలుగా పనులు నిలిచిపోయాయి.
ఇది ఎంత వరకు కరెక్టో ప్రజలు ఆలోచించుకోవాలి. తాజా ఎన్నికల్లో భారాస అభ్యర్థుల్ని గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.