Tuesday, November 5, 2024

అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?.

నారద వర్తమాన సమాచారం

మే :23

అందరి దృష్టి కౌంటింగ్ పైనే.. అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు.. రౌండ్‌లను ఎలా నిర్ణయిస్తారు..?.

ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. చీమచిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు సహా కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు. అంతేకాదు, కౌంటింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది. లెక్కింపునకు 4 గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెబుతారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మెుదలవుతుంది. గం. 8.30ల వరకూ ఇది కంటిన్యూ అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని అంచనాగా ఉంది.

రౌండ్లను ఎలా నిర్ణయిస్తారు..?
నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్‌లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. 14 – 15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈ వి ఎమ్ ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు.

వి వి ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఎలా?
ఓటింగ్ పట్ల విశ్వాసాన్ని మెరుగుపరచడానికి 2013లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వి వి ప్యాట్ ) సిస్టమ్‌ని ఈ వి ఎమ్ లకు జోడించారు. వి వి ప్యాట్  సిస్టమ్ అభ్యర్థి పేరు, ఎన్నికల చిహ్నాన్ని కలిగి ఉన్న ప్రింటెడ్ పేపర్ స్లిప్‌ను రూపొందిస్తుంది. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్‌ల స్లిప్పుల లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్స్‌ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఏయే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు.

ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లు వి వి ప్యాట్ ల స్లిప్‌ల ఓట్లను చూస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్కపెడతారు. ఇలా మూడు సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పుల‌లోని లెక్కనే పరిగణనలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించడం అనేది ఉండదు.

ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జార్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకుల సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది.

ఓట్ల లెక్కింపు ఇలా…
ఒకో ఈవీఎంలో వెయ్యి నుంచి 1200 ఓటు ఉంటాయి.
రౌండ్ కి 14టేబుల్స్ మీద.. అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు తెలుస్తాయి.
లక్ష ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్లలో ఫలితం వస్తుంది.
రెండు లక్షలు ఉంటే 16లేదా 20 రౌండ్లలో ఫలితం వెలువడుతుంది.
భీమిలి, గాజువాక లాంటి మూడు లక్షల ఓట్లు ఓటర్లు ఉన్న చోట 24 రౌండ్లు ఉండచ్చు.

ఓట్ల లెక్కింపు బాధ్యత ఎవరిది?
ఒక నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారి బాధ్యత వహిస్తారు. ఇందులో ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. రిటర్నింగ్ అధికారి ప్రభుత్వ అధికారి లేదా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రతి నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం చేత నామినేట్ చేయబడిన స్థానిక అధికారి అయి ఉంటారు.

కౌంటింగ్ ఎక్కడ జరుగుతుంది?
పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఓట్లను లెక్కించే స్థలాన్ని రిటర్నింగ్ అధికారి నిర్ణయిస్తారు. కౌంటింగ్ తేదీ, సమయం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఆదర్శవంతంగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును ఒకే చోట చేయాలి. ప్రాధాన్యంగా ఆ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి ప్రధాన కార్యాలయంలో చేయాలి. ఇది రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించాల్సి ఉంటుందిల. అయితే, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సరాసరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. ఈ పరిస్థితిలో రిటర్నింగ్ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఒకే చోట కానీ, వేర్వేరు స్థానాల్లో కానీ లెక్కింపు జరుగుతుంది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading