నారద వర్తమాన సమాచారం
జూన్ :02
కౌంటింగ్ రోజు హింస రాజేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కుట్రలు: ప్రత్తిపాటి
రాష్ట్రంలో కౌంటింగ్ రోజు హింస రాజేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆధ్వర్యంలోనే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ఓటమి తప్పనిసరి పరిస్థితుల్లో అల్లర్లకు దిగాలని ముందు నుంచే దురాలోచనలతో ఉన్న వైకాపా ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కుట్రలకు మరింత పదును పెట్టిందన్నారాయన. కూటమి ఘనవిజయంతో పాటు తెలుగుదేశం ఒంటరిగానే సాధారణ ఆధిక్యాన్ని అందుకోనుందన్న అంచనాలను వైకాపా, సీఎం జగన్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారన్నారు ప్రత్తిపాటి. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అధికార వైకాపా నేతలు ఇప్పటికీ ప్రభుత్వ అధికారుల్ని బెదిరించడం, తద్వారా కౌంటింగ్ రోజు పరిణామాల్ని ప్రభావితం చేయాలని చూడడం మానుకోలేదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసులోనూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలకు దిగాలని వైకాపా అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలున్న నేపథ్యంలో వారి కౌంటింగ్ ఏజెంట్లపైనా రిటర్నింగ్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ప్రత్తిపాటి. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చినా వైకాపా కుట్రలు మాత్రం మానుకోవడం లేదన్నారు. ఉద్యోగుల ఓట్లపై వాళ్లు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోందన్నారు. మొదట్నుంచీ ఓటమి భయంతోనే ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఓట్లు వేయకుండా అడ్డుకోవాలని చూశారని, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు వాటిని చెల్లకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ప్రత్తిపాటి. ఉద్యోగవర్గాల్లో 90శాతం ఓట్లు కూటమికే అనుకూలంగా పడ్డాయి అన్న అంచనాలే అందుకు కారణమన్నారు. కానీ వైకాపా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి విజయాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని, జూన్-4 ఫలితాలు అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తథ్యమన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఆధిక్యంతో కూటమి గెలవబోతోందని, రాష్ట్ర ప్రజలు ఎంతబలంగా మార్పుకోరుకున్నారో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.