Monday, January 13, 2025

ఓడలు బళ్లు అవుతాయి.బళ్లు ఓడలవుతాయి అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతోంది.

నారద వర్తమాన సమాచారం

జూన్: 04

ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతోంది.

2023లో జరిగిన తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైనా .. ఆర్నెల్లు తిరక్క ముందే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సత్తా చాటారు.  రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన ఈ నేతలను తిరస్కరించిన ప్రజలు ఏకంగా ఇప్పుడు పార్లమెంట్‌కు పంపించారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు కాగా,  మరో ఇద్దరికి  ఎమ్మెల్యేలుగా అనుభవం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దీటుగా ఎదుర్కొని విజయబావుటా ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు తోడు .. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వివరించగలిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దీటుగా ఎదుర్కోగలిగారు.

పడి లేచిన కెరటం.. బండి సంజయ్‌..

పడి లేచిన కెరటంలా  లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్‌ ఘన విజయం సాధించారు. రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆయన..  నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.  అయినా, ఏమాత్రం పట్టు సడలకుండా నియోజవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. స్వల్ప కాలంలోలేని తిరిగి పుంజుకొని లోక్‌సభ ఎన్నికల్లో  2.12లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో బండి సంజయ్‌ గెలుపొందారు. 

నిజామాబాద్‌లో పట్టు నిలుపుకొన్న అర్వింద్‌..

ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుకుపడే నేతగా గుర్తింపు ఉన్న ఆయన..  అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి  కల్వకుంట్ల సంజయ్‌ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్వింద్‌ లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ  1.13లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్‌ విజయం సాధించారు.

25ఏళ్ల తర్వాత మెదక్‌ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన రఘునందన్‌ 

మెదక్‌ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలోఓటమి పాలయ్యారు.  అయినా, ఆయన పై నమ్మకంతో భాజపా అధిష్ఠానం  మెదక్‌ టికెట్‌ ఇచ్చింది.  న్యాయవాది, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించారు. భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొని మెదక్‌ గడ్డపై 25 ఏళ్ల తర్వాత భాజపా జెండా రెప రెపలాడించారు.

ఈటలకు కలిసొచ్చిన సుదీర్ఘ రాజకీయ అనుభవం

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లోపోటీ చేసిన ఈటల రాజేందర్‌ భారాస అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈటల పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల .. లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి వ్యూహం మార్చారు.  మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి పై 3.86లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా జయకేతనం ఎగురవేశారు. మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం కనబర్చారు. ఏ రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఈటలకు పోటీ ఇవ్వలేకపోయారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading