నారద వర్తమాన సమాచారం
జూన్ :05
సీనియర్ జర్నలిస్టు కొమ్మాలపాటి శరశ్చంద్ర జ్యోతిశ్రీకి పిఎఫ్ పెన్షన్ పత్రాలు అందజేస్తున్న రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్
అవసరమైన పత్రాలు అందిస్తే
20రోజుల్లోనే పెన్షన్ మంజూరు
పిఎఫ్ రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ వెల్లడి
గుంటూరు, జూన్ 5: నెలవారీ సక్రమ చెల్లింపులతో పాటు తగిన పత్రాలు అందజేస్తే 58 సంవత్సరాలు నిండిన సభ్యులకు కేవలం 20రోజుల్లోనే పెన్షన్ మంజూరు చేస్తామని ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ చెప్పారు. విశాలాంధ్ర, ఆంధ్రభూమి తదితర దినపత్రికల్లో 40ఏళ్ల పాటు పనిచేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మాలపాటి శరశ్చంద్ర జ్యోతిశ్రీకి బుధవారం తమ కార్యాలయంలో పెన్షన్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ కమిషనర్ రాజేష్ మాట్లాడుతూ.. 58ఏళ్ల వయసులోపు కనీసం 12నెలల పాటు సంస్థ యజమాని, సభ్యుని షేరుధనం చెల్లింపులు జరిగి వుంటే పెన్షన్ కు అర్హులవుతారని తెలిపారు. రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్.. ఇలా కేటగిరి ఏదైనా కనీసం 20మంది ఉద్యోగులు కలిగిన సంస్థలన్నీ పిఎఫ్ సేవల పరిధిలోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కనీసం 12నెలల చెల్లింపులు జరిగి సర్వీసులో వుంటూ అకాల మరణానికి గురైన సభ్యునికి 7లక్షల రూపాయల బీమా సొమ్ము, అలాగే పిఎఫ్ సభ్యత్వం కలిగి కనీసం రెండు మాసాల పాటు చెల్లింపులు జరిగి వుంటే రెండున్నర లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము లభిస్తుందని రీజనల్ కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ వెల్లడించారు.
అసిస్టెంట్ కమిషనర్ జి.ఆర్.జె.ఆర్. మాధవ శంకర్ మాట్లాడుతూ.. తమ కార్యాలయ పరిధిలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు వుండగా, దాదాపుగా 20లక్షల మంది పీఎఫ్ సభ్యత్వం కలిగి వున్నారని తెలిపారు. వీరందరికీ తాము నిరంతరం విశేష సేవలు అందిస్తున్నామన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ.. ప్రావిడెంట్ ఫండ్ సంస్థ అందిస్తున్న సేవలు, సౌకర్యాల పట్ల కార్మికులను చైతన్యపరచడంలో పాత్రికేయులు ఎల్లవేళలా ముందుంటారని చెప్పారు. విశాలాంధ్ర దినపత్రికలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ ఎం. రమేష్ బాబు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.