
నారద వర్తమాన సమాచారం
మందుపాతర పేలి ఏసు మృతిచెందటం బాధాకరమన్న మావోయిస్టులు
ములుగు:
జూన్ :07
వాజేడు మండలం కొంగాల అటవీప్రాంతంలో జూన్ 4న మందుపాతర పేలిన ఘటనపై మావోయిస్టులు స్పందించారు. మందుపాతర పేలి ఏసు అనే వ్యక్తి మృతిచెందడం బాధాకరమన్నారు. తమ జాడకోసం పోలీసులే ఏసును అటవీప్రాంతంలోకి పంపి ప్రాణాలు తీశారని ఆరోపించారు. వేట పేరుతో అతణ్ని అడవిలోకి పంపింది పోలీసులే అని మండిపడ్డారు. తమ రక్షణ కోసం మాత్రమే ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసుకున్నామని, ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసులు వారి ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే వాజేడు మండలంలో 2006నుంచి ఇప్పటికే పలుమార్లు మందుపాతర పేలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2006ఫిబ్రవరిలో కొప్పుసూరు- మొరుమూరుకాలనీ గ్రామాల మధ్య గుండ్లవాగు సమీపంలో అమర్చిన మందుపాతర పేలి ఒకరి కంటి చూపు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కొంగాల అటవీ ప్రాంతంలో 2018లోనూ నీరుడువాగు వద్ద మందుపాతర పేలి ఆవు ప్రాణాలు కోల్పోయింది. అరుణాచలపురం అటవీప్రాంతంలో మే 30న ప్రెజర్ బాంబు తొక్కడంతో ఒక కుక్క మృతిచెందగా, మరొకటి గాయపడింది. ప్రస్తుతం కొంగాల అటవీప్రాంతంలో మరోసారి బాంబు పేలి ఒకరి ప్రాణాలు కోల్పోయారు.
వాజేడు మండలంలో వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు ఘటనలు జరగడంపై స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువైపు వేళ్తే ఏం జరుగుతుందో అని అడుగు వేయడానికే భయపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు కూంబింగ్ నిర్వహిస్తాయి, ఆ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని వీటిని ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు—