నారద వర్తమాన సమాచారం
జూన్ :10
8 నెలల తర్వాత ఇజ్రాయెల్ బందీలు ముగ్గురికి విముక్తి..
హమాస్ చెరలో 8 నెలలుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గతంలో అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడికి తెగబడిన హమాస్ ఉగ్రవాదులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌పై దాడిచేసి ఎంతోమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిలో నోవా అగ్రమని, ఆమె బాయ్‌ఫ్రెండ్ అవినాట్ కూడా ఉన్నారు.
ఉగ్రవాదులు నోవాను బలవంతంగా మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టి గాజా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో పెను సంచలనమైంది. నోవా తల్లి అప్పటికే బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్నారు.
కుమార్తె ఉగ్రవాదుల చెరలో బందీగా ఉందన్న విషయం తెలిసిన ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం సెంట్రల్ గాజాలోని నుసీరత్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా నోవా సహా మరో ముగ్గురు బందీలను విడిపించింది.
అనంతరం నోవాను టెల్ అవీవ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 8 నెలలపాటు వారి చెరలో బందీగా మగ్గిపోయిన నోవా.. కళ్ల ముందు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.