Thursday, November 21, 2024

దేహం తండ్రి ప్రసాదం అని వేదం స్పష్టంగా చెప్పింది.

నారద వర్తమాన సమాచారం

’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.

‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.*

తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం

తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది.

తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.

తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.

‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.

‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి.*
*దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు.

అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.

వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన ‘శ్రవణ కుమారుడు’ …

అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ‘ప్రవరాఖ్యుడు’ …

అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు …

ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.

అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.

అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’ కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.

ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే!
కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం.
‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.

కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’ లను మొదటి రెండుగా చెబుతారు.

వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక!

ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక!

లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.

అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!

అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.

ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!

అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.

శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం ……!


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading