Thursday, December 4, 2025

నేడు కొత్తపల్లి జయశంకర్ జయంతి…..

నారద వర్తమాన సమాచారం

విశ్వబ్రాహ్మణ లెజండరీస్

డా॥ కొత్తపల్లి జయశంకర్‌గారు

( నేడు కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా )

డా॥ కొత్తపల్లి జయశంకర్ గారు విశ్వబ్రాహ్మణ జాతిలో జన్మించిన గొప్ప మేధావి, విద్యావేత్త, రచయిత, కులపతి,మానవతావాది. వారు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి తన జీవితాన్ని అర్పించినమహనీయమూర్తి.

ఉద్యమ రూపకల్పన చేసిన సిద్ధాంతకర్త. 1952 నుండి 2011లోమరణించేవరకు వారు అహర్నిశలు ఉద్యమం గురించే ఆలోచనలు చేసి నాయకులకు చక్కనిసలహాలు అందజేశారు.

వారు తెలంగాణ ఉద్యమం కోసం చేసిన
సేవలు నిరుపమానములు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టి, వారి
మరణానంతరం వారికి విగ్రహాలు రూపొందించి ప్రతిష్ఠ గావించారు..వారి జీవితంలోని స్మరణీయ ఘట్టాలీదిగువ పొందుపరుపబడ్డాయి.

డా॥ కొత్తపల్లి జయశంకర్‌గారు
ది: 6-8-1934 వ తేదీన
వరంగలు జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో విశ్వబ్రాహ్మణ
పుణ్యదంపతులైన శ్రీమతి మహాలక్ష్మి, శ్రీ లక్ష్మీకాంతరావుగారి
రెండవ కుమారులుగా జన్మించారు. జయశంకర్‌గారు వరంగల్‌లోని
మర్కజీ స్కూలులో విద్యనభ్యసించిన పిమ్మట వారు వరంగలు కాలేజీలో ఇంటర్మీడియట్, బి.ఏ. విద్యనభ్యసించి 1954లో బి.ఏ. డిగ్రీ పొందారు. పిమ్మటవారు బెనారస్ యూనివర్సిటీ నుండి
అర్ధశాస్త్రంలో ఎం.ఏ. డిగ్రీ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.ఎడ్ డిగ్రీ గైకొన్నారు.
తరువాత వారు ఆర్థికశాస్త్రంలో పరిశోధన చేసి డాక్టరేట్ (పిహెచ్. డి) పట్టా స్వీకరించారు. వారు

1958-60 సంవత్సరాల మధ్య మర్కజీ స్కూలులో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు.

తరువాత కొంతకాలం లెక్చరర్‌గా పనిచేసి 1975లో సీ.కే. ఎం. కళాశాలలో ప్రిన్సిపాల్ గా
ప్రవేశించి అక్కడ 1979 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1979లో వారు వరంగలులోని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా నియమింపబడి 1981లో వారు ఆ ఉద్యోగం నిర్వహించారు.

వారు 1982 నుండి 1991 వరకు హైదరాబాదులోని “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజనకు (CIEFL) రిజిస్ట్రార్ పదవి నిర్వహించారు.

తరువాత 1991నుండి 1994 వరకు వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-చాన్సెలర్‌గాఉద్యోగించారు.

కొంతకాలం వారు వరంగలు రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల కార్యనిర్వాహక
సభ్యులుగాను, కేరళ రాష్ట్రంలోని కొట్టాయం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ఉన్నత విద్య
ప్రణాళికా మండలిలో కొంతకాలం సభ్యులుగా నున్నారు.

జయశంకర్ గారు 1952 నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొఱకు వారు 2011 జూన్లో మరణించేవరకు కృషి చేస్తూనే ఉన్నారు. వారు 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణా
ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

వారు తెలంగాణా ఉద్యమానికి సిద్ధాంత కర్తగా ఉంటూ అహర్నిశలు కృషిచేశారు. ఈ ఉద్యమం కోసం వారు వివాహం కూడా చేసుకొనలేదు.

వీరి రచనలు :

1)తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌

2)తెలంగాణలో ఏం జరుగుతోంది

3)వక్రీకరణలు – వాస్తవాలు

4)తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి)

5) ‘తెలంగాణ’ (ఆంగ్లంలో)

1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు.
అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా’ (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి) అని అనేవారు.

విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసారు.

తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.

జయశంకర్ గారి ఆలోచనలు:

ఉస్మానియా విద్యార్థుల గురించి

‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి

మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!!

ఆందోళన కార్యక్రమాల్లో జయశంకర్

1952లో విశాలాంధ్రకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యింది. నేనప్పుడు వరంగల్‌లో ఇంటర్ చదువుతున్నా. 1948-52 ప్రాంతంలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు. తెలంగాణలో ఇంగ్లీషు రాదు కమ్యూనిస్టు భావాలు చాలా ఉంటాయని కేంద్రం ఆంధ్ర ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడికొచ్చిన వాళ్లు మనల్ని బాగా ఎక్కిరించేవాళ్లు. అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఆయనను పిలిపించి వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు. ఆయన మనల్ని బాగా వెక్కిరిస్తే, మేం ప్రతిఘటించినం. కలెక్టర్లు, పోలీసులు కూడా వాళ్లే కాబట్టి లాఠీచార్జీ జరిపించారు. అప్పుడు నేను కూడా లాఠీదెబ్బలు తిన్నా.

అప్పటికే తెలంగాణ ఎన్జీవోస్, టీచర్లు ఆంధ్రోళ్ల వల్ల అవమానాలకు గురవుతూ.. హైదరాబాదు‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరినా. మా బస్సు భువనగిరిలో ఫెయిలయ్యింది. ఈలోపు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిగి 7గురు విద్యార్థులు చనిపోయారు. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే అమరవీరుల జాబితాలో చేరే వాణ్ణి. ఆ అదృష్టం నాకు దక్కలేదు. బతికి ఏం చేశానయ్యా అంటే ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది.

ఆయన చివరి మాటలు :

భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం… ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి. ఉద్దేశ పూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు.. అయినా వీటిని బాగుచేస్తే.. గ్రామీణ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది. ఇక నిజాం కాలంలో విద్య, వైద్యం రెండూ ఉచితమే.. అయితే వీటన్నింటిని వారు నాశనం చేశారు. అభివృద్ధి అంటారు కానీ వాళ్లు ఇక్కడ ఒక్క ఆసుపత్రినిగానీ, కాలేజీనిగానీ కట్టారా?ముఖ్యంగా వనరుల కొరత ఉండదు. ఇప్పుడు వాటిని ఇష్టానుసారంగా, అక్రమంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పైసలు మనం వాడుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే… ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక సంస్కృతిని ధ్వంసం చేశాయి ప్రభుత్వాలు. ఉద్యమాలను అణచివేసే పేరుతో బీభత్సం సృష్టించారు. అడుగడుగున పోలీస్ రాజ్యమే ఉంది. అందుకే ప్రజాస్వామిక సంస్కృతి తిరిగి స్థాపించబడాలి. అది జరిగితేనే మిగతా కార్యక్షికమాలు జరుగుతాయి. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే.. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక.

ఆయన మరణం ఉద్యమానికి ఒక గొడ్డలి పెట్టు అని చెప్పాలి. తెలంగాణా ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా కు ఆయన పేరు పెట్టింది. రెండేళ్లపాటు గొంతు క్యాన్సర్‌తో బాధపడి 2011 జూన్ 21 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు ప్రొఫెసర్ జయశంకర్ తుదిశ్వాస విడిచారు. ప్రొఫెసర్ జయశంకర్ మృతికి మూడు రోజులు సంతాపదినాలుగా పాటించాలని తెలంగాణ ప్రజా సంఘాలు, అన్ని జేఏసీలకు తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading