నారద వర్తమాన సమాచారం
అక్రమాల బారి నుంచి ప్రజల్ని కాపాడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: ప్రత్తిపాటి
చిలకలూరిపేట మున్సిపల్ అధికారులతో ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా అంతుదరి లేకుండా సాగిపోతున్న భూ అక్రమాలు, పెద్దఎత్తున సాగుతున్న అడ్డగోలు రిజిస్ట్రేషన్లను ఆపి ప్రజలు నష్టపోకుండా చూడాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంగా తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర మంత్రివర్గం 22ఏ జాబితాలోని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసినా, అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నా అదే కారణమన్నారాయన. ఇది గిట్టని వైకాపా నాయకులు వారి హయాంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేసిన వాళ్లు, అడ్డగోలుగా భూ లావాదేవీలు నిర్వహించిన వారు ప్రభుత్వంపై, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అయినా చర్యలపై వెనకడుగు వేసేది లేదన్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం, అసైన్డ్ భూములను కొట్టేసి వేసిన వెంచర్ల విషయంలో ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదన్నారాయన. శుక్రవారం చిలకలూరిపేట పురపాలక కార్యాలయంలో ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్, పట్టణ ప్రణాళిక, శానిటరీ, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందదర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్డ్రంలో ఎక్కడా లేని పరిస్థితి చిలకలూరిపేటలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పట్టణ పరిధిలో ఎక్కడా అనధికార లేఅవుట్లు ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు. వ్యవసాయ భూమి 12 సెంట్లపైనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటే చిలకలూరిపేటలో 2, 3 సెంట్లు కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా ఎన్ని లేఅవుట్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఎకరమైనా, 2 ఎకరాలైనా అధికారికంగా ఉండాలని, వాటికి రహదారుల వంటి సౌకర్యాలు ఉండాలన్నారు. అనధికారికంగా వేసిన లేఅవుట్ల కారణంగా పట్టణం అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. అనధికార లేఅవుట్లు వేసి 33 శాతం మున్సిపాలిటీకి కడుతున్నారని, అక్కడ రహదారులు, దీపాలు, మురుగుకాల్వలు, తాగునీరు కూడా రాదన్నారు. గత ఐదేళ్లలో చిలకలూరిపేటలో ఒక్క లేఅవుట్ కూడా అధికారికంగా ఉంది లేదని.. మొత్తం అనధికార లేఅవుట్లేనని వివరించారు. అందులో కొనుగోలు చేసిన వారు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరని… వసతులు రావన్నారు. కొన్నిచోట్ల ఎకరానికి 80సెంట్లు విక్రయిస్తున్నారని, అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి కూడా ఉండట్లేదని, ఆ పరిస్థితులు మారాలన్నారు. అలానే సచివాలయాల పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి వాటన్నింటినీ కమిషనర్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు. అందుకనే నెలలో 4-5 సచివాలయాలను సందర్శిస్తానని, అక్కడికి స్థానిక ప్రజలను పిలిచి అక్కడ సమస్యలు ఏం ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్థానిక సచివాలయ సిబ్బందిపైనే ఉంటుంద్నారు. రహదారులను శుభ్రం చేయడంతోపాటు డంపింగ్ చేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. శానిటేషన్ నిర్వహణలో ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. ఎక్కడ కూడా వీధి దీపం పోయిందనే ఫిర్యాదు రాకూడదన్నారు. దోమల బెడద వీలైనంత వరకు తగ్గించాలని, అందుకు అనుగుణంగా ఫాగింగ్ చేయాలన్నారు. వీలైనంత వరకు ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా వెనక్కి పెట్టుకోవాలని దుకాణదారులకు సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఉన్నంతవరకు ఎలాంటి అద్దెలు చెల్లించకుండా వాడుకోవచ్చని, జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌లో కూడా అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అనధికార కుళాయిల విషయంలో చర్యలు అవసరమని సూచించారు ప్రత్తిపాటి. కొత్త కనెక్షన్ కోసం కావాలంటే అప్లై చేసుకోవాలని చెప్పాలని, వాటిని ఇప్పించేందుకు చర్యలు తీసుకుందామన్నారు. ఎక్కడ దీపం పోయినా తక్షణమే వేయాలన్నారు. అదేవిధంగా శానిటేషన్ వర్కర్లు ఎక్కడ పనిచేయకపోయినా మున్సిపల్ అధికారులదే బాధ్యతని తెలిపారు. పౌరసేవలకు అవసరమైన నిధులను తాము సమకూరుస్తామని చెప్పారు. పొరుగుసేవల సిబ్బందిలో ఎవరు పనిచేయకపోయినా తొలగించే హక్కు అధికారులకు కల్పిస్తున్నామన్నారు. శానిటేషన్ మేస్త్రీ అయినా వర్కర్ అయినా పని చేయాల్సిందేనని నిష్కర్షగా తేల్చిచెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం తాగునీటి సమస్య రానివ్వబోమని అన్నారు. కొత్త పింఛన్లు మంజూరుకు ఏ సమయంలోనైనా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో ఉదయం 10 గంటల్లోగా డంపింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఎక్కడ చెత్తచెదారం కనిపించినా చర్యలు తప్పవన్నారు. సచివాలయాల పరిధిలో సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.