Friday, November 22, 2024

మా తరం రేడియో కథనం

నారద వర్తమాన సమాచారం

మా తరం రేడియో కథనం

ఉదయం ఆరు గంటలకు ఆకాశవాణి… విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.
రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!

రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి.
4 గంటలనుండి మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు (సన్నాయి) ప్రసారం చేసేవారు.

ఆరు గంటలకు పుష్పాంజలి మొదలయ్యేది. ఆదివారం నాడు ‘శ్రీ సూర్య నారాయణ… వేద పారాయణ…’, సోమవారం నాడు భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, ‘శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా’ అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో ‘నమో నమో హనుమంతా’ అన్నపాటో… ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!
7 గంటలకు! వార్తలు చదువుతున్నది “అద్దంకి మన్నారే”
మధ్యాహ్నం ‘ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది…’ అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో… ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత… ‘కార్మికుల కార్యక్రమం’.

చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు. సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే ‘పసిడిపంటలు’ మొదలయ్యేది.

పసిడి పంటలవ్వగానే ‘ప్రాంతీయ వార్తలు’ చదివేవారు… ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు. అవవ్వగానే ‘మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు!’ అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం. ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం.

రెండవ్వగానే ‘ఢిల్లీ నుంచి వార్తలు’ అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే… కు… కు… కు… అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. ఇంగ్లీషులో వార్తలు… ఢిల్లీనించి ప్రసారమయ్యేవి. ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.

ఇక ఆదివారాలు
సంక్షిప్త శబ్ద చిత్రం సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు… వి.వి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఏబియస్ రామారావు, పాండురంగ విఠల్… వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు… మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు. అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.

ఇక ‘సిలోన్’ ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం.

రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటల పెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.

ఆ కాలంలో… పసితనంనుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే!

అప్పట్లో… సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు. రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీగార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం. పాట ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మ్యూజిక్ మొదలవ్వగానే పాట ఏమిటో చెప్పేసేవాళ్ళం. ఇక హిందీ పాటలు… మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ … ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం…అమాయకత్వం..

ఆదివారం మధ్యాహ్నం గుమ్మంముందు కూర్చుని రేడియోలో ‘సంక్షిప్త
శబ్ద చిత్రం’ (ఒక గంటకి
కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం…

‘రారండోయ్… రారండోయ్…’
బాలవినోదం విన్నాము… బాలల్లారా ఈపూట…
చాలిక కథలు.. చాలిక మాటలు… చాలిక పాటలు… నాటికలు…
చెంగున రారండి….చెంగు చెంగున పోదాము

ఆంధ్ర బాలనంద సంఘం, రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే ‘పిలుపు పాట’.

1950లనుండి కొనసాగిన బాలానందం ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు. న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారు రూపొందించిన ఆ ప్రోగ్రాంలో పి.సుశీల కూడా పాడేవారు.

క్రికెట్ కామెంటరీ వింటూ… మురిసిపోయేవాళ్ళం.
వాతావరణ విశేషాలవరకు విని, ‘అబ్బో… ఇంకో రెండు రోజులు వర్షాలు’ అని గొణుక్కుంటూ …..

ఇంకా అనేకానేక Programs ఆనందాలనందించిన రేడియోకి ధన్యవాదాలు!

🤝💝💝🤝


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading