నారద వర్తమాన సమాచారం
కేజ్రీవాల్ రాజీనామా- అసెంబ్లీ రద్దు: మధ్యంతర ఎన్నికలు ఫిక్స్..!!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతోన్నట్లు వెల్లడించారు.
ప్రజలు మళ్లీ కొత్తగా ఓటు ద్వారా తీర్పు ఇచ్చేంత వరకూ తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోననీ తేల్చి చెప్పారు. ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని, శిరసా వహిస్తానని అన్నారు.
*ఎన్నికల తరువాతే..*
ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలను నిర్వహించిన తరువాతే తాను ముఖ్యమంత్రిగా ఆ సీటులో కూర్చుంటానంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు.
*బెయిల్ తరువాత..*
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
*మనీలాండరింగ్ ఆరోపణలు..*
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు అరవింద్ కేజ్రీవాల్. సుమారు ఆరు నెలల పాటు తీహార్ జైలులో గడిపారు. బెయిల్ కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆయన బెయిల్ పిటీషన్లను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. చివరికి బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
*బెయిల్ తరువాత తొలిసారి..*
బెయిల్ లభించిన రోజు రాత్రే తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి ఆతిషీ, ఎంపీ సంజయ్ సింగ్, ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చారు.
*సచ్ఛీలత నిరూపించుకుంటా..*
తాజాగా ఆయన పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. మద్యం పాలసీ కుంభకోణం, మనీలాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని, వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు.
*కొత్త సీఎం ఎన్నిక..*
బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆరోపణలే అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతోన్నానని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు భావిస్తే ఓటు వేస్తారని, అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని అన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.