Friday, November 22, 2024

శ్రీవారి మహాప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారు ముఖ్యమంత్రి :నారా చంద్రబాబు నాయుడు:

నారద వర్తమాన సమాచారం

శ్రీవారి మహాప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఐదేళ్లపాటు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని మార్చారు

భక్తుల మనోభావాలకు వాళ్లు విలువనివ్వలేదు….ఆచారాను మంటగలిపారు

తిరుమల లడ్డూ విషయంలో ప్రజల గుండెమండుతోంది

లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్

ఆగమ సలహాదారుల సూచన మేరకు తిరుమలలో శాంతి హోమం

ఏ మత ప్రార్థనాలయాల్లో ఆ మతం వారికే మేనేజ్మెంట్ బాధ్యతలు

మత సామరస్యాన్ని కాపాడటం ముఖ్యమంత్రిగా నా బాధ్యత

అమరావతి :-

‘గత పాలకుల నిర్వాకంతో, అహంభావంతో తిరుమల పవిత్రను దెబ్బతీశారు. వారు చేసిన అపచారానికి అందరం క్షోభ అనుభవిస్తున్నాం. శ్రీవారి సన్నిధిలో ప్రక్షాళన తీసుకొచ్చి మళ్లీ పూర్వవైభం తీసుకొస్తాం. జరిగిన తప్పులు క్షమించాలని బ్రహ్మోత్సాలకు ముందే పవిత్ర యాగం చేస్తారు. కానీ ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ చేస్తారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ హయాంలో పునరావాస కేంద్రంగా తిరుమల

‘కోట్లాది మంది హిందూ భక్తులంతా పవిత్రంగా భావించే మహా పుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండలవారిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలచుకుంటారు. భక్తులందరికీ ఒక నమ్మకం, ఇష్టమైన కలియుగ దేవుడు వెంకటేశ్వరస్వామి. తిరుమలకు వచ్చి కలియుగ దైవం ఆశీర్వాదం తీసుకుంటే బాధలు పోతాయని భక్తుల నమ్మకం. అలాంటి పవిత్రమైన దేవాలయ ప్రతిష్టను గత పాలకులు దెబ్బతీశారు. ఎన్టీఆర్ వైకుంఠ కాంప్లెక్స్-1 కడితే నేను కాంప్లెక్స్-2 కట్టాను. ఎన్టీఆర్ అన్నదానం పెడితే…నేను ప్రాణదానం తీసుకొచ్చాను. అన్నదానం కార్యక్రమం ద్వారా ఎంతమందికైనా భోజనం పెట్టొచ్చు. దానికి కార్పస్ ఫండ్ కూడా రూ.2 వేల కోట్లు ఉంది. ప్రాణదానంలో కూడా కార్పస్ ఫండ్ పెరుగుతోంది. 2003లో స్విమ్స్ లో ప్రారంభించాం. బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సమయంలో 23 క్లేమోర్ మైన్స్ పెట్టారు…అప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వరస్వామి. నాకు పునర్జన్మను ఇచ్చారు. నేను ఏ పని చేసినా వెంకటేశ్వరున్ని తలచుకుని చేస్తాను. రాజశేఖర్ రెడ్డి 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలు అన్నప్పుడు నాడు నేను పోరాడాను. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులకు పునరావాసం కల్పించారు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదు. ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదు.’ అని అన్నారు.

అన్యమతస్తులను టీటీడీ బోర్డు చైర్మన్లుగా పెట్టారు

‘నేను కూడా సీఎంగా కాదు..భక్తుడిగా చెప్తున్నా…వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 300 ఏళ్లుగా ఈ లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు ఎంతో క్వాలిటీగా ఉంటాయి. నాణ్యత లేని సరుకులు ఎక్కడా వినియోగించరు. దేవుడికి సరుకులు సరఫరా చేసే వాళ్లు సైతం ఇచ్చేవాటిని పవిత్రంగా భావించి ఇస్తారు. ఇంట్లోకి లడ్డు తెచ్చి పెడితే ఇళ్లంతా సువాసన ఉంటుంది. వడ, పొంగలి ప్రసాదాలు దేనికదే ప్రత్యేకత ఉంటుంది. శ్రీవారి లడ్డూకు చాలా డిమాండ్ ఉంటుంది. 40 గ్రాముల ఆవునెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర దినుసులు 70 గ్రాములు వాడి లడ్డును తయారుచేస్తారు. 2009లో పేటెంట్ రైట్ దక్కింది. అలాంటి ప్రత్యేక ఉన్న లడ్డూను గత పాలకులు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్ చేశారు. చట్టాన్ని మార్చి 50 మంది నామినేటెడ్ పోస్టులు అని తీసుకొచ్చారు. ఎక్స్ అఫిషియో అనే విధానాన్ని తెచ్చి పెట్టారు. టీటీడీ టికెట్లు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు. నమ్మకం లేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టి అన్యమతస్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని ఉపయోగించారు.’ అని చంద్రబాబు మండిపడ్డారు.

నిబంధనలకు నీళ్లొదిలారు

‘టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లని పెట్టి నిబంధనలు మార్చారు. నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డైరీకి అనుభవం ఉండాలి…దాన్ని యేడాదికి తగ్గించారు. నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాల్సి ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే విధంగా మార్చారు. రూ.250 కోట్లు యేడాదికి కనీసం టర్నోవర్ ఉండాలి…దాన్ని రూ.150 కోట్లకు తగ్గించారు. ఈ విధంగా ఇష్టానుసారంగా నిబంధనలు తగ్గించారు. ఏఆర్ డెయిరీ అని తమిళనాడు నుండి తీసుకొచ్చారు. 10 లక్షల కేజీల ఆవు నెయ్యికి 12.03.2024న ఈ టెండర్ పిలిచారు. 08.05.2024న టెండర్ ఫైనల్ అయింది. కిలో రూ.319.90 ఫైనల్ చేశారు. రూ.319లకు కనీసం డాల్డా రావడం లేదు….అలాంటిది ఆవు నెయ్యి కొనుగోలకు టెండర్ ఫిక్స్ చేశారు. జూన్ 12 నుండి సప్లై మొదలు పెట్టారు. 06.7.2024న రెండు ట్యాంకులు, 15.7.2024న మరో రెండు ట్యాంకుల నెయ్యి సరిగా లేదని గుర్తించారు. ప్రక్షాళన మొదలు పెట్టి, అపవిత్ర కార్యక్రమాలన్నీ పక్షాళన చేసి పుణ్యక్షేత్రానికి పూర్వవైభవం తీసుకురావడానికి నాకు భగవంతుడు ఆదేశాలు ఇచ్చారని ఈఓ శ్యామలారావుకు చెప్పాను. తర్వాత నుండి రోజురోజుకు మార్పులు చోటు చేసుకున్నాయి. సప్లై చేసేవాళ్లు సరిగా చేయకపోతే వార్నింగ్ ఇచ్చారు అయినా వినలేదు. నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీ ల్యాబ్ కు 16.7.2024న పంపిస్తే 23.07.2024న రిపోర్టులు వచ్చాయి. ఆ రిపోర్టులు వస్తే వాటిని ఆధారంగా తీసుకుని చర్యలు ప్రారంభించారు. నాణ్యత లేదు అనేది ప్రసాదం తిన్న ప్రతిఒక్కరూ చెప్పారు. రిజల్ట్ నెంబర్ 1లో ఎస్.వాల్యూ 86.62 ఉంది..కానీ ఉండాల్సింది 98.05 నుండి 101.95 ఉండాలి. దీనికి కారణం ఆలివ్, సోయాబీన్, సన్ ఫ్లవర్, ఫిష్ ఆయిల్ ఉండటం వల్ల. నెంబర్ 3 లో 22.43 ఎస్ వాల్యూ ఉంది…95.90 నుండి 104.10 ఉండాలి…ఇది రావడానికి కారణం పామాయిల్, బీఫ్ కొవ్వు ఉండడం. నెంబర్ 4 లో ఎస్ వాల్యూ 117.42 ఉండాలి…కానీ 97.96 నుండి 102.04 ఉంది. దీనికి కారణం..పంది కొవ్వు ఉండటం. ఇవన్నీ చూశాక ఈవో నోటీసు ఇచ్చి నెయ్యి సప్లై చేసే డైరీని బ్లాక్ లిస్టులో పెట్టారు.’ అని సీఎం వివరించారు.

అపచారం చేసిన మీకు మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.?
‘నేను ప్రక్షాళన చేయాలని చెప్పాను…దీంతో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇవి చూశాక ప్రజలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. రిపోర్టులు బయటకు రాకుండా చూశారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకుండా మళ్లీ ఎదురుదాడి ప్రారంభించారు. చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. భక్తుల మనోభావాల పట్ల గౌరవం ఉంటే ఎదురుదాడి చేస్తారా?. మీరు ఎదురు దాడి చేస్తే మంచి వాళ్లు అని సర్టిఫికేట్ ఇవ్వాలా.? వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి, రిపోర్టు తారుమారు చేస్తే సహకరించాలా.? నిన్నటి నుండి ఒక్కొక్కరి స్టేట్ మెంట్ చూస్తే గుండె రగిలిపోతుంది. మీకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. సీఎంగా ఉన్నంత వరకు మతసామరస్యం కాపాడటం నా బాధ్యత. నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. వేరే మతాలను ద్వేషించడం నేను ఎప్పుడూ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిలపై దాడులు జరిగితే మెదక్, తాడేపల్లిగూడెం వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకున్నాను.’ అని గుర్తు చేశారు.

చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పడకుండా వెకిలి మాటలా.?
‘గత పాలకుల హయాంలో జరిగిన అపచారాలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త యజ్ఞం ప్రారంభించారు. అన్యాయం జరిగింది అంటే మళ్లీ వెకిలి చేస్తున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తే మనిషి పుట్టుకు పుట్టారా అని అనిపిస్తోంది. రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇన్ని తప్పులు చేసి మళ్లీ సిగ్గులేకుండా ప్రధానికి లేఖ రాశారు. హిందువులంతా కుతకుతలాడుతుంటే అసత్యాలతో లేఖ రాసి ఎదురు దాడి చేస్తున్నారు. కేంద్రమంత్రి రికమెండేషన్, ఇతర రాష్ట్రాలతో ముఖ్యమంత్రుల రికమెండేషన్ తో టీటీడీ బోర్డు మెంబర్లు నియమించామని రాశారు…బోర్డు మెంబర్లు ఏం చేయగలుగుతారు.? మీ హయాంలో టీటీడీ ఈఓ ఎవరు..ఎక్కడి నుండి వచ్చారు? ఇంట్లో ఎవరైనా చనిపోతో యేడాది దాకా తిరుమల వెళ్లరు…వెళ్తే అపచారం. ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన 12వ రోజే వచ్చారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం తిరుపతి వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చామని చెప్పారు…ఆయనకంటే జగన్ గొప్పోడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు.? టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని మాట్లాడతారు. భూమన కరుణాకర్ రెడ్డి కూతరు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు…మళ్లీ ఎదురుదాడి చేస్తారు. నేను కూడా జెరూసలెం వెళ్లాను…అక్కడి సాంప్రదాయాలు పాటించాను. కేరళ గురువాయర్ కు చొక్కా లేకుండా వెళ్లాలి…అది సాంప్రదాయం. ఒక్కో గుడికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్క టీటీడీ ఛైర్మన్ 3 లక్షల 75 వేల దర్శన లెటర్లు ఇచ్చారు…ఇవన్నీ చూసి షాక్ అయ్యా. విధ్వంసానికి నాంది పలికి మళ్లీ మాది చిన్న పాత్రే పాటించామని చెప్తున్నారు. అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ఉన్న ల్యాబ్ కు వెళ్లాలి. కానీ గత ఐదేళ్లు అలాంటి టెస్టులు లేవు. టెండర్ కండీషన్ ప్రకారం కల్తీ ఉందా లేదా అనేది పరీక్ష చేయాలి..ఆ పరీక్షలకు అవసరమైన ల్యాంబ్ కు కనీసం రూ.70 లక్షలు ఖర్చు చేయలేకపోయారు. ఇంత అపచారం చేసి కూడా పశ్చాత్తాప పడటం లేదు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాణా, గడ్డి సరిగా లేకపోవడంతో నెయ్యి కల్తీ అయ్యిందనడం సిగ్గుచేటు
‘కల్తీ ఎందుకు అయ్యింది అంటే ఆవులు సరైన దాణా తినలేదు, గడ్డి సరిగా తినలేదు, అనారోగ్యంతో ఉన్నాయి కాబట్టి అలా రిపోర్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రధానికి రాసిన లేఖ లో పేర్కొన్నారు. వీళ్లు మాట్లాడిన అబద్ధాలకు సంఘ బహిష్కరణ చేయాలి. 15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. 37 వేల ఆవులకు మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు, దాని వల్ల నాణ్యత దెబ్బతింది అని చెప్తున్నాడు. కరుడు గట్టిన నేరస్తులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. క్షమాపణ చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అన్ని ఆవులకు అనారోగ్యం, దాణా సమస్య ఉందా.? రామతీర్థంలో రాముడి తల నరికారు…అక్కడ పోరాటానికి వెళ్తే నాపై దాడి, కేసులు పెట్టారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం జాతికే అవమానం.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారంపై, భక్తుల మనోభావాల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు*
‘1. తిరుమల ఆలయంలో రేపు సోమవారం శాంతి హోమం చేపడతాం. గత నెలలో చేసిన పవిత్ర ఉత్సవాలతో దోషాలు తొలగిపోయినా…ఇప్పుడు శ్రవణం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహిస్తున్నాం.
2. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం పై దర్యాప్తుకు సిట్ వేస్తాం. ఐజీ స్థాయి పర్యవేక్షణ లో సిట్ ద్వారా ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నాం. నిర్థిష్ట సమయంలో వీళ్లు దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.
3. ఏ ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం అవసరం అయితే కొత్త చట్టం తీసుకువస్తాం. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో సాంప్రదాయాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి మతం వారి ఆచారాలకు విలువనిస్తాం.
4. అన్ని దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం చేపడతాం. ఆలయ సేవలు, నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెడతాం.
5. దేవాలయాల నిర్వహణపై అన్ని స్టడీ చేసి, సంబంధిత వర్గాలతో చర్చించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించి వాటిని పాటించే విధానం తెస్తాం. దీని కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మహిళలను గౌరవించేలా ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేసే అంశంపైనా నిర్ణయాలు తీసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading