Thursday, July 24, 2025

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతనే

నారద వర్తమాన సమాచారం

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతనే

భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి

భారత పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు

ప్రముఖ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం

మంగళగిరి:

నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి శత జయంతి సందర్భంగా సోమవారం నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ నిర్వహించిన ప్రత్యేక సదస్సుకు శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు. ఇప్పటివరకు ముద్రితం కాని ఆచార్య సచ్చిదానందమూర్తి గారి రచనలను” ఆన్ ఎడ్యుకేషన్& ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్” పేరుతో శ్రీ అశోక్ వోహ్రా గారు, శ్రీ కె రమేష్ గారి సంపాదకత్వం లో తీసుకువచ్చిన పుస్తకాన్ని, ఆయన స్మృతి చిహ్నంగా తీసుకువచ్చిన పోస్టల్ కవర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “ఆధునిక విద్యాభ్యాసంలో తత్వశాస్త్రం ఒక ప్రత్యేక విభాగంగా రూపుదిద్దుకోవడం మనిషి వికాసానికి,సమాజ వికాసానికి ఎంతో మేలు చేసే విషయం. అయితే ఒక ప్రత్యేక భాగానికే పరిమితం కాకుండా బాల్యదశ నుంచే పాఠ్య ప్రణాళికలో మన తత్వ విజ్ఞానాన్ని క్రమబద్ధమైన భాగంగా చేయడం వల్ల దీర్ఘాకాలికంగా మన దేశానికి ఎంతో ప్రయోజనకరం.” అని సూచించారు. వివిధ ఉపనిషత్తుల్లో మహర్షులు చేసిన బోధనలను ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు ఉటంకించారు.
వృక్షో రక్షిత రక్షితః, వసుదైక కుటుంబకం, మానవసేవే మాధవసేవ, అహింసా పరమో ధర్మః వంటి ఎన్నో తాత్విక బోధనలు ప్రపంచ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం చూపిస్తాయి అని స్పష్టం చేశారు.
విద్యార్థి దశలోనే సరైన, సానుకూల బీజాలు నాటగలిగినప్పుడే మంచి పౌరులు, తద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. భారతీయ తత్వ దర్శనమే ఇందుకు సరైన పరిష్కారం అన్నారు.
” ప్రపంచం నలుమూలల విస్తరిస్తున్న పెడపోకడలకు భిన్నమైన సమాజంగా మనం ఎదగాలన్నా, ప్రపంచం మనల్ని అనుసరించాలన్నా తిరిగి మనం మన మూలాలకు వెళ్లాలి. మన విద్యా విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. నూతన విద్యా విధానం ఈ దిశగా కృషి చేస్తోంది. ” అని పేర్కొన్నారు.
“జీవ చైతన్యం, జీవితపు చైతన్యం విషయంలో భారత ఉపఖండం కొన్ని వేల సంవత్సరాలుగా మిగిలిన ప్రపంచం కన్నా ముందు ఉంది. విశ్వ గురువుగా ఆవిర్భవించింది. ప్రపంచం నలుమూలల ఎంతోమందికి చైతన్యపు వెలుగులను చూపించింది. భారత ఉపఖండంలో ఈ జిజ్ఞాసతోనే ఎందరో ఋషులు, మహర్షులు అవతరించారు. వేద వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, త్రిపిటికలు అవతరించాయి. తత్వాన్ని బోధపరిచాయి. బోధపరుస్తూనే ఉన్నాయి.
భారతీయ తత్వశాస్త్రంలో అటు లౌకిక, ఇటు అలోకిక చింతనలు ఎన్నో ఉన్నాయి. ఆధ్యాత్మిక, తార్కిక, శాస్త్ర విజ్ఞాన చింతనలు ఇమిడి ఉన్నాయి. ఇంతటి బహుళ తాత్వికచింతనలు ప్రపంచంలోని మరే దేశంలోనూ ఆవిర్భవించలేదు.తత్వపు వెలుగులను ప్రసరింప చేయడానికి ఈ పుణ్య భూమిలో ఎందరో మహనీయులు తమ జీవితాలను ధారపోశారు. ” అని చెప్పారు
20వ శతాబ్దంలో శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి తర్వాత భారతీయ తత్వ శాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప జ్ఞాని కొత్త సచ్చిదానందమూర్తి గారు అని అన్నారు. “జ్ఞాన సముపార్జనలో, దాన్ని పదిమందితో పంచుకోవడంలో వారు చూపిన తపన నేటి తరానికి స్ఫూర్తిదాయకం.” అని శ్రీ వెంకయ్య నాయుడు చెప్పారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సచ్చిదానంద మూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్థాయికి ఎదగడం వెనక ఆయన స్వయంకృషి ఉందన్నారు. సచ్చిదానందమూర్తి గారు భారతీయ తత్వాన్ని అణువణువునా జీర్ణించుకొని ఆచరించి చూపిన ఆధునిక ఋషి అని అన్నారు. “భారతీయ తత్వ దర్శనం లోనే కాకుండా ఇతర దేశాల్లోని తత్వచింతనలను కూడా పూర్తిగా ఆకళింపు చేసుకున్న గొప్ప జ్ఞాన నిధి.” అని చెప్పారు.
“షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనకున్న సంపదను గాని, విజ్ఞానాన్ని గాని పదిమందితో పంచుకోవాలని భారతీయ సనాతన ధర్మం బోధిస్తోంది. పంచుకుంటే పెరుగుతుంది కానీ తగ్గదు. ఈ సనాతన ధర్మాన్ని అణువణువున నింపుకొని ఆయన ఆచరించి చూపించారు. తన విజ్ఞానాన్ని జీవితమంతా పంచుతూనే ఉన్నారు. తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు.” అని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సచ్చిదానంద మూర్తి గారి పేరిట ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఆఫ్రో-ఏషియన్ ఫిలాసఫీ పేరుతో తత్వ శాస్త్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నేటి తరం విద్యార్థులు కొత్త సచ్చిదానందమూర్తి ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్  శ్రీ కామినేని శ్రీనివాసరావు , నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్  కే గంగాధర్ రావు , ప్రొఫెసర్ ఎం త్రిమూర్తి రావు, ప్రొఫెసర్ అశోక్ వోహ్రా ,ప్రొఫెసర్ శకేఎస్ చలం , ప్రొఫెసర్ కె రత్న షీలా మణి , ప్రొఫెసర్ ఎన్వీ కృష్ణారావు , ప్రొఫెసర్ జి సింహాచలం  తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading