నారద వర్తమాన సమాచారం
శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది…
శ్రీ గాయత్రీ దేవి అలంకారం (04-10-2024)
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే
శరన్నవరాత్రులలో రెండవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.
వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి … ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున కాషాయ లేదా నారింజ రంగు చీరల్లో కొలువుదీరిన అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం సమర్పిస్తారు.
సకల మంత్రాలకీ మూలమైనశక్తిగా, వేదమాతగా ప్రసిధ్ధి పొంది ముక్తా విద్రుమహేమనీలదవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము – అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము ‘గయ’, ‘త్రాయతి’ అను పదములతో కూడుకుని ఉంది.
“గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. ‘గయలు’ అనగా ప్రాణములు అని అర్థము. ‘త్రాయతే’ అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీ మద్రామాయణమును రచించారు.
గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది.
ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుచున్నది. సమస్తదేవతా మంత్రాలకీ గాయత్రీమంత్రంతో అనుబంధం ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు అన్నాదులు ప్రసాదాలు నివేదన చేయబడతాయి. గాయత్రీ అమ్మ వారినిదర్శించటం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ, గాయత్రీ మాతను దర్శించటం వలన సకల మంత్ర సిధ్ధి తేజస్సు, జ్ఞానము పొందుతారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.