నారద వర్తమాన సమాచారం
ఎన్‌టీఆర్ జిల్లా, అక్టోబర్ 15,
కృష్ణమ్మ ఒడ్డున కనువిందు చేసేలా.. డ్రోన్ షో
- రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లపై కలెక్టర్ సృజన కసరత్తు
ఈ నెల 22వ తేదీన కృష్ణానది తీరంలో నిర్వహించే భారీస్థాయి డ్రోన్‌షోకు చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ డా. జి.సృజన.. వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌ను డ్రోన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్-2024ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం కృష్ణమ్మ ఒడ్డున డ్రోన్‌షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ సృజన మంగళవారం పున్నమి ఘాట్ బబ్బూరి గ్రౌండ్స్‌ను సందర్శించారు. కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు హాజరుకానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. డ్రోన్ షో, లేజర్ లైట్ అండ్ సౌండ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించేలా వీఐపీ గ్యాలరీ, పబ్లిక్ గ్యాలరీ.. ఇలా వివిధ గ్యాలరీల ఏర్పాట్లపై అధికారులకు సూచనలిచ్చారు. డ్రోన్ సదస్సు వేదిక అయిన మంగళగిరి సీకే కన్వెన్షన్ నుంచి బబ్బూరి గ్రౌండ్‌కు డెలిగేట్స్‌ను తీసుకురావడం, వాహనాల పార్కింగ్, వివిధ వేదికల ఏర్పాటు తదితరాలపై చర్చించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతమి శాలి తదితరులు పాల్గొన్నారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)
Discover more from
Subscribe to get the latest posts sent to your email.