నారద వర్తమాన సమాచారం
సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమంలోనే తెలుగుదేశం బలం: ప్రత్తిపాటి
తెదేపాలో క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి
దేశంలోనే వేరే ఏ రాజకీయ పార్టీకి లేని రీతిలో ఉన్న సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సంక్షేమం చూడడంలోనే తమపార్టీ బలమంతా ఉందన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పార్టీ అధ్యక్షుడిని నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు చూపే క్రమశిక్షణ, నిబద్ధత, కట్టుబాట్లు తిరుగులేని అదనపు బలాలు అన్నారు. సభ్యత్వ నమోదు, కమిటీలు, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వరకు అన్నింటా అది కనిపిస్తుందన్నారు. చిలకలూరిపేట 9వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. కార్యకర్తల సమక్షంలో ఆన్‌లైన్‌లో రూ.లక్ష చెల్లించి పార్టీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ఎన్నికల నియమావళిని అనుసరించి ముందుకెళ్తోందన్నారు. ఈ సారి పార్టీ సభ్యత్వ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని, రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారన్నారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి సాధారణంగా చనిపోయినా ఆ రోజే అంత్యక్రియలకు రూ.10 వేలు అందించనున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి సౌకర్యం లేదన్నారు. దేశంలోని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యం కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. సభ్యత్వానికి ఇచ్చే రూ.100 కూడా బీమాకు తక్కువేనని, రూ.5 లక్షల ప్రమాద బీమాకు రెండేళ్లకు రూ.105 ఖర్చు అవుతుందన్నారు. కార్యకర్తలు ఇచ్చే రూ.100కి పార్టీ కొంత చెల్లించి బీమా కల్పిస్తుందన్నారు. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఈ సభ్యత్వం ఒక హక్కులా ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ హక్కునే పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వంలో ప్రజలందరికీ సమానంగా ఉంటుందని, పార్టీ సభ్యత్వ నమోదు కార్డు ఉంటే అదనంగా పార్టీ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ వంద రూపాయలు పెద్దగా ఎక్కువ కూడా కాదన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును తేలిగ్గా తీసుకోకుండా ఎవరి వంద రూపాయలు వారే ఇచ్చి చేసుకుంటే పార్టీ పట్ల అంకితభావం ఉన్నట్లుగా ఉంటుందన్నారు. సూపర్ సిక్స్‌తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను దశలవారీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే చాలా సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందన్నారు. అన్నింటికీ మించి జగన్‌రెడ్డి కబంధహస్తాల నుంచి రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఏం మాట్లాడినా బెదిరింపులు ఉండేవని, ఇప్పుడు అలాంటి బెదిరింపుల బెడద కూడా పోయందన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వాములు అయితే పార్టీలో వారికి ఒక హక్కుగా ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం లేకపోతే ఎలాంటి పదవులు కూడా ఇవ్వబోమన్నారు. పార్టీ సభ్యత్వం లేకపోతే పార్టీలో దేనికి అర్హత పొందలేరని అన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు రూ.లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వబోతున్నామని, 4 నెలలకు ఒక సిలిండర్ ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకునే వారు ఎక్కడికైనా వెళ్లి ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చని.. ఎవరూ ఆపడానికి కూడా వీల్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం అందించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పార్టీ సభ్యత్వంతో పాటు అర్హులైన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటును కూడా నమోదు చేసుకోవాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.