నారద వర్తమాన సమాచారం
నవంబర్ 9న శ్రీశైలానికి చంద్రబాబు.. ఆ రోజే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 9న శ్రీశైలానికి వెళ్లనున్పారు.
ఈ పర్యటనలో భాగంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఓ నూతన కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్ సర్వీసును చంద్రబాబు ప్రారంభిస్తారు.
డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన సీ ప్లేన్‌ను చంద్రబాబు ప్రారంభిస్తారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ప్రారంభోత్సవం తర్వాత.. శ్రీశైలం వరకు సీ ప్లేన్‌లోనే చంద్రబాబు ప్రయాణించనున్నారు.
శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లికార్జున స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను స్థానిక అధికారులు పర్యవేక్షించారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి శ్రీశైలం జలాశయం వద్ద సీ ప్లేన్ ల్యాండింగ్ ప్రదేశాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సీ ప్లేన్‍లో 14 సీట్లు ఉంటాయి. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద మొదలైన సీ ప్లేన్.. శ్రీశైలం జలాశయం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిసర జలాల్లో ల్యాండ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీ ప్లేన్ ద్వారా శ్రీశైలం జలాశయానికి చేరుకోనున్న చంద్రబాబు.. రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయంలోకి వెళ్తారు. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత సీ ప్లేన్‌లోనే తిరిగి విజయవాడకు బయల్దేరి వెళ్తారని అధికారులు చెప్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయాలకు వెళ్లే భక్తులకు అనుకూలంగా ఉండేలా అధికారులు ఈ సర్వీసును ప్రారంభిస్తున్నారు.
మరోవైపు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగ సీ ప్లేన్ ప్రాజెక్టును చేపట్టాయి. శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఈ సర్వీసును రెగ్యులర్‌గా నడపాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే విశాఖపట్నం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ ఈ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీ ప్లేన్ సర్వీసు విజయవంతమైతే ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.