నారద వర్తమాన సమాచారం
చంద్రబాబుతో విదేశాంగ మంత్రి చర్చలు – వైసీపీలో అనుమానాలు !
ఢిల్లీ పర్యటనకు ఎప్పుడు వెళ్లినా చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను తప్పక కలుస్తారు. ఎందుకంటే ఏపీకి నిధుల కోసం తప్పదు. ఇతర మంత్రుల్ని కలుస్తారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయం మాట్లాడతారు. కానీ విదేశాంగ మంత్రిని మాత్రం కలవరు. ఎందుకంటే విదేశాంగ శాఖతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పని ఉండదు. కానీ ఈ సారి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా చంద్రబాబు నివాసానికి వచ్చి మాట్లాడారు.
విదేశాంగ మంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి మాట్లాడిన అంశంపై వైసీపీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో చాలా వరకూ విదేశాల నుంచి రావాల్సిన సమాచారం ఎక్కడిదక్కడే ఉంది. గతంలో సీబీఐ లేఖలు రాసింది.వాటికి సమాధానాలు వస్తే చాలా వరకూ అక్రమాస్తుల కేసుల్లో మనీలాండరింగ్ చిక్కులు తొలగిపోతాయి. ఇప్పుడు ఆ సమాచారం అంతా వచ్చేలా చూడాలని చంద్రబాబు జైశంకర్ ను కోరి ఉంటారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ప్రభుత్వం మారిన తర్వాత వెలుగు చూసిన కొన్ని అంశాలు, అవినీతి వ్యవహారాలు, అక్రమంగా డబ్బు తరలించేందుకు చేసిన కుట్రల వ్యవహారాల్లో అంతర్గతంగా ప్రభుత్వం ఆరా తీస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని కూడా సేకరించేందుకు జైశంకర్ తో చంద్రబాబు చర్చించారని భావిస్తున్నాయి. చంద్రబాబు ఆవేశ పడటం లేదని ఈ సారి చాలా వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.