Friday, April 18, 2025

ఒక్కొక్కరిగా జగన్‌కు దూరమవుతున్న ఫ్యామిలీ,& పొలిటికల్ ఫ్రెండ్స్..

నారద వర్తమాన సమాచారం

ఒక్కొక్కరిగా జగన్‌కు దూరమవుతున్న ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్రెండ్స్..

ఎందుకిలా, కారణం ఏంటి?

పవర్‌లో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది. అందరూ దగ్గరి వాళ్లలాగే బిహేవ్‌ చేస్తుంటారు. పవర్‌పోతేనే తెలుస్తుంది. దగ్గరి వాళ్లు ఎవరు.? అవసరపూర్తి కోసం వచ్చినోళ్లు ఎవరని? వైసీపీ అధినేత జగన్‌కు ఇప్పుడు ఇదే సీన్‌ కనిపిస్తోందట. అధికారంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఫ్యాన్ గాలి పడటం లేదంటూ.. సైకిల్‌ సవారీకి సై అంటున్నారు. పైకి పోతేపోనీ అంటున్న వైసీపీ అధినేత.. లోలోపట మాత్రం ఇంత చేస్తే ఇలా హ్యాండిస్తారా అంటూ మధన పడుతున్నారట. దగ్గరి వాళ్ల మని చెప్పుకుని వెళ్లిపోయినోళ్లు ఎవరు? నెక్స్ట్‌ జంపింగ్ బాటలో ఉన్నది ఎంత మంది.?

జగన్ కు దూరమవుతున్న ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్రెండ్స్..

జగన్‌ వెంట నడుస్తాం. రాజన్న రాజ్యమే లక్ష్యమని చెప్పుకున్న వాళ్లంతా ఒక్కొక్కరిగా జంపింగ్‌ బాట పడుతున్నారు. పవర్‌లో ఉన్నప్పుడు జగన్‌కు దగ్గరి వాళ్లమని చెప్పుకున్న నేతలు హ్యాండిస్తున్నారు. షర్మిల నుంచి మొదలు ఇప్పుడు బాలినేని వరకు..మోపిదేవి నుంచి జగన్ క్లాస్‌మెట్‌ రాజీవ్ కృష్ణ వరకు అందరూ తమ దారి తాము చూసుకుంటున్నారు. వరుస పెట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్, పొలిటికల్ ఫ్రెండ్స్‌ జగన్‌కు దూరమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే చిన్ననాటి క్లాస్‌మెట్ కూడా జగన్‌కు బై బై చెప్పి పసుపు కండువా కప్పేసుకున్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, జగన్ స్నేహితుడు, క్లాస్ మెట్ అయిన రాజీవ్ కృష్ణ పార్టీని వదిలివెళ్లిపోయారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించిన రాజీవ్ కృష్ణ..టీడీపీ గూటికి చేరిపోయారు. దీంతో జంపింగుల వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది.

దూరమైన తల్లి, ప్రత్యర్థిగా మారిన చెల్లి..!

తల్లి ప్రత్యక్షంగా జగన్‌కు దగ్గరగా లేరని చెప్పుకుంటున్నారు వైసీసీ నేతలు. ఇక చెల్లి ప్రధాన ప్రత్యర్థిగా మారిన పరిస్థితి కనిపిస్తూనే ఉంది. బాలినేని, మోపిదేవి వెంకటరమణ, ఆళ్లనాని ఇలా అయిన వాళ్లు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. వైఎస్సార్ స్నేహితులు, సహచరులు, సన్నిహితులు వంటి వారు జగన్ దరిదాపుల్లో కూడా లేరని అంటున్నారు. రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి వైసీపీని వీడారు.

జగన్ కు హ్యాండిచ్చిన మాజీ మంత్రులు..

ఇక మాజీమంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, మద్దాల గిరి, పెండెం దొరబాబు, మహిళా కమిషన్‌ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ జగన్‌కు హ్యాండిచ్చారు. వీళ్లలో ఎక్కువ మంది జగన్‌ పార్టీ పెట్టినప్పటి నుంచి వెంట నడిచిన నేతలు. అయితే అన్ని జిల్లాల్లో ఒక ఎత్తు అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే వైసీపీకి చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా పోయారట. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత అసలు బయటకు రాని గ్రంధి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

గోదావరి జిల్లాల్లో ఫ్యాన్‌ పార్టీకి ప్రతికూల పరిస్థితులు..

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఫ్యాన్‌ పార్టీకి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లు పదవులు అనుభవించిన వారు ప్రతిపక్షంలో ఉండలేమంటూ సైడైపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలను కూటమి క్లీన్‌ స్వీప్‌ చేయడంతో..వైసీపీ ముఖ్య నేతలు కొందరు సైలెంట్‌ అయిపోయారు. ఇంకొందరు అయితే టీడీపీ లేకపోతే జనసేనలోకి వెళ్లిపోతున్నారు. జడ్పీ ఛైర్మన్‌లు, మున్సిపల్ ఛైర్మన్లు..ఇలా అందరిది కూటమి బాటే అయిపోయింది.

గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి?

గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీలో వివిధ స్థాయిల్లో పని చేసిన నేతలు టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొవ్వూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కింగ్ మేకర్‌గా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే దివంగత పెండ్యాల కృష్ణబాబు అల్లుడైన ఎస్.రాజీవ్ కృష్ణ టీడీపీలో చేరడంతో ఇక వైసీపీ పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పార్టీ మారడంతో కార్యకర్తలు కూటమి వైపే చూస్తున్నారు.

వలసలను ఆపలేక జగన్‌ చేతులు ఎత్తేశారా..?

మాజీ ఎంపీలు, సిట్టింగ్‌ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు.. ఇలా ఒకరేంటి వరుసగా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలో జోష్‌ నింపాల్సిన నేతలు పూర్తిగా డీలా పడిపోతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే నియోజకవర్గాల్లో వైసీపీని నడిపించే నాయకులు ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. వలసలను ఆపలేక జగన్‌ చేతులు ఎత్తేశారా.. అధికారం లేనప్పుడు ఇదంతా కామన్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading