నారద వర్తమాన సమాచారం
వయనాడ్‌లో ప్రియాంక విజయనాదం
ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ.. తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు.
4.1 లక్షల మెజార్టీతో భారీ గెలుపు
వయనాడ్‌లో ప్రియాంక విజయనాదం
దిల్లీలో శనివారం ప్రియాంకా గాంధీని అభినందిస్తున్న మల్లికార్జున ఖర్గే
వయనాడ్: ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ.. తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన (3.64 లక్షలు) మెజార్టీని ఆమె అధిగమించారు. ఎంపీ హోదాలో మొదటిసారి లోక్‌సభలోకి ప్రవేశించనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. రెండు స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి ప్రియాంక రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆమె 6,22,338 ఓట్లు సాధించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ దక్కించుకున్న (6,47,445) ఓట్ల కన్నా ఇవి తక్కువే అయినప్పటికీ ప్రియాంక సాధించిన మెజార్టీ ఎక్కువగా ఉంది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌లో రాహుల్ 4.31 లక్షల ఆధిక్యాన్ని సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్‌కు 2,11,407 ఓట్లు, మూడోస్థానంలో నిలిచిన భాజపా అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 1,09,939 ఓట్లు వచ్చాయి. వయనాడ్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గరి నుంచి ఈసారే పోలింగ్ శాతం అత్యల్పంగా ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ శాతం 74 ఉండగా.. ఈ ఉపఎన్నికలో కేవలం 65 శాతంగానే నమోదైంది.
ప్రచారకర్త నుంచి..
అది.. 1998 జనవరి 26. తల్లి సోనియా గాంధీతో కలిసి తమిళనాడులోని ఓ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పాల్గొన్నారు. ఆ సభలో ఆమె ‘ఎల్లారుం కాంగ్రెసిక్కు ఓట్ పొడుంగల్ (అందరూ కాంగ్రెస్‌కు ఓటెయ్యండి)’ అంటూ తమిళంలో చెప్పారు. ఆమె మాట్లాడింది ఒక్క వాక్యమైనా.. నాటి ప్రచారంలో సోనియా కంటే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించారు. అప్పటికి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా సోనియాకు అడుగడుగునా అండగా ఉంటూ వచ్చారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. యూపీ వెలుపలా కొన్ని చోట్ల ర్యాలీల్లో కనిపించారు.
క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక ఆలస్యంగా వచ్చారు. ‘‘నా రాజకీయ రంగ ప్రవేశానికి చాలా.. చాలా.. సమయం పట్టొచ్చు’’ అని ఆమె 1999 సెప్టెంబరులో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లే జరిగింది. సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత 2019లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక అడుగుపెట్టారు. నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
వయనాడ్ వాణి వినిపిస్తా: ప్రియాంక
ఈ విజయంపై ప్రియాంక హర్షం వ్యక్తంచేశారు. ‘‘నా మీద నమ్మకం ఉంచిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు. పార్లమెంటులో మీ గొంతుకను వినిపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆమె ‘ఎక్స్’లో స్పందించారు.
ముగ్గురు గాంధీలు ఒకేసారి పార్లమెంటుకు.
వయనాడ్‌లో విజయంతో.. నెహ్రూ-గాంధీ కుటుంబంలో దక్షిణాది ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు.. ఒకేసారి ముగ్గురు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు పార్లమెంటులో ఉంటారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యుడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.