Thursday, December 12, 2024

మార్గశిర మాసం ప్రాశస్త్యం

నారద వర్తమాన సమాచారం

మార్గశిర మాసం ప్రాశస్త్యం

డిసెంబర్ 02 సోమవారం నుండి మార్గశిర మాసం ప్రారంభం

కార్తిక మాసంలో సోమవారాలు ముఖ్యమైనవి. మాఘమాసంలో ఆదివారాలు. ఇలా ప్రతిమాసంలోనూ విశిష్టమైన వారాలు ఉంటాయి. జగద్గురువైన శ్రీకృష్ణుడు గీతామృతాన్ని పంచిన శుభమాసం మార్గశిర మాసం కనుక ఈ మాసంలో గురువారానికి ప్రాముఖ్యత ఉంది. మార్గశిర గురువారాల వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా పాటిస్తారు.

మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని.

“మాసానాం మార్గశీరోహమ్”

అని గీతాచార్యుడు పదో అధ్యాయంలోని 35వ శ్లోకంలో స్వయంగా చెప్పాడు. కార్తికమాసంలో దీక్షలతో, ఉపవాసాలతో, పుణ్యస్నానాలతో సాధనలను పండించుకున్న భక్తులు మార్గశిరంలో విష్ణు సంకీర్తనలో తన్మయులవుతారు. ఈ మాసపు శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా, బహుళ ఏకాదశిని విమలైకాదశి లేదా సఫలైకాదశిగా నియమనిష్టలతో ఆచరిస్తారు.

🌺 మార్గశిర ప్రాశస్త్యం 🌺

భూమి పుత్రుడైన కుజుని నక్షత్రమైన మృగశిరా నక్షత్రంలో పౌర్ణమి తిథినాడు చంద్రుడు ఉంటాడు. అందుకే భూలోకవాసులకు మార్గశిరం మరింత ముఖ్యమైన మాసంగా పరిగణిస్తారు. మృగశిరా నక్షత్రం మూడు నక్షత్రాల కలయిక. ఇది శీర్షాకృతిని పోలి వుంటుంది. అందుచేత మృగశీర్షమయింది. ఈ నక్షత్రం శ్వేతవర్ణంలో ఉంటుంది. సౌరమానం ప్రకారం ఈ మాసంలోనే ధనుస్సంక్రమణం జరుగుతుంది. అందువల్ల మార్గశిర మాసంలో ఏర్పడే పౌర్ణమిని ధనుషూర్ణిమ అని కూడా పిలుస్తారు. జ్ఞానసిద్ధి, ఆధ్యాత్మికతను కలిగించే గురువు అధిదైవంగా ఉండే ధనూరాశిలో సూర్యుడు ఉంటాడు. సాధనను పరిపక్వం చేయగల బుధుడు. అధిదైవమైన మిధున రాశిలో చంద్రుడు ఉంటాడు. అందుకే మార్గశిర పౌర్ణమికి విష్ణు ఆరాధన మోక్షదాయకం, సిద్ధి ప్రదాయకం అయింది.

🌺 విశిష్ట పండుగల మాసం 🌺

మార్గశిర పౌర్ణమినాడు యమప్రీతి కోసం యముణ్ణి ఆరాధించటం వల్ల నరక పూర్ణిమ, కోరల పూర్ణిమ అని పేర్లు ఉన్నాయి. అలాగే మార్గశిర మాసం విశిష్టమైన పండుగలు, వ్రతాల మాసంగా పేరెన్నిక గన్నది. ఈ మాసంలో సుబ్రమణ్య షష్టి, కాలభైరవాష్టమి, గీతాజయంతి, ధనుర్మాస వ్రతం, దత్తజయంతి తదితర పండుగలు వస్తాయి. మార్గశిర మాసం శుక్లపక్షంలో మూడోరోజైన తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ ప్రతాన్ని ఆచరిస్తారు. చతుర్ది తిధికి వరద చతుర్థి అని పేరు. ఆరోజు ఒంటిపొద్దు ఉపవాసం ఉండి వినాయకపూజ చేస్తారు. పంచమి తిథిని స్మృతి కౌస్తుభం నాగపంచమిగా వర్ణించింది. చతుర్వర్గ చింతామణి ప్రకారం ఆరోజు శ్రీపంచమి వ్రతం ఆచరించి సరస్వతీదేవికి ప్రత్యేకంగా ఆరాధిస్తారు. మార్గశిర శుక్ల సప్తమి నీలమత పురాణం ప్రకారం మిత్రసప్తమి. ఆరోజు ఆదిత్యుని ఆరాధించాలి. ద్వాదశితిథికి అఖండ ద్వాదశాదిత్య వ్రతాన్ని నిర్వహించుకుంటారు. అలాగే త్రయోదశి తిథినాడు హనుమద్ర్వతంతో పాటు అనంగ త్రయోదశీ ప్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు. చతుర్దశికి చాంద్రాయణ వ్రతానికి ప్రారంభ తిథి. రాత్రి వరకూ భోజనం చేయకుండా గౌరీదేవిని ఆరాధిస్తారు.

కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి తిథి శిలావ్యాప్తి వ్రతం ఆచరించే తిథి. ఆంగ్లమానం ప్రకారం జనవరి నెలలో వస్తున్న మార్గశిర బహుళ సప్తమికి ఫలసప్తమి, అష్టమికి అనఘాష్టమి, నవమికి రూపనవమీ వ్రతాన్ని దత్తాత్రేయ భక్తులు ఆచరిస్తారు. సఫల ఏకాదశినాడు వైతరణీ వ్రతం, ధనద వ్రతం ప్రత్యేకంగా చేస్తారు. ద్వాదశి నాడు మల్లి ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు పాటిస్తారు. త్రయోదశి తిథి యమ త్రయోదశి వ్రతానికి ముఖ్యమైనది. చివరిగా మార్గశిర అమావాస్యకు వకుళామావాస్య అనిపేరు. ఇలా ఎన్నో వ్రతతిథులకు నెలవైన మార్గశిర మాసంలో విష్ణునామ సంకీర్తనతో ధన్యులమవుదాం.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading