Saturday, July 19, 2025

సాంస్కృతిక పునర్వికాసం అవసరం- పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం జాతీయ అధ్యక్షులు

నారద వర్తమాన సమాచారం

సాంస్కృతిక పునర్వికాసం అవసరం
– పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం జాతీయ అధ్యక్షులు

భారత సమాజంలో సాంస్కృతిక పునర్జీవనం, పునర్వికాసం నేడు ఎంతైనా అవసరం ఉందని అరసం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకోబోతున్న పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ ఆదివారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన పెనుగొండ లక్ష్మీనారాయణ అభినందన సభకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ కులాలు, మతాలు, అసమానతలు, విద్వేషాలు లేని సమాజాన్ని సాధించుకున్న రోజున గురజాడ, శ్రీశ్రీ, గుర్రం జాషువా ల సాహిత్యం చదివే అవసరం ఉండదన్నారు. ప్రజలు పఠనా శక్తిని పెంచుకోవాలని, అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ సమాజ చైతన్యానికి తోడ్పడాలన్నారు. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న సామ్యవాద, లౌకిక వాదాలకు తూట్లు పొడుస్తూ కషాయికరణ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సాహితీవేత్తలపై దాడులు చేస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని వివరించారు. తన తల్లిదండ్రులు తనను అత్యంత ప్రజాస్వామ్యంగా పెంచారని, నేడు తనకు లభిస్తున్న పురస్కారం అరసం సంస్థకే దక్కుతుందని కృతజ్ఞత తెలిపారు. ప్రధాన వక్తగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ గత 50 సంవత్సరాలుగా అందిస్తున్న సాహిత్యం సమాజ మలుపులో కీలక పాత్ర పోషించిందన్నారు. పెనుగొండతో ముచ్చట్లు, వారి మండలీకంతో కూడిన చలోక్తులు అర్థవంతంగా ఉండి ఆలోచన రేకెత్తిస్తాయని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ పెనుగొండ లక్ష్మీనారాయణ కథా ప్రేమికుడని, నిర్మోహమాట విమర్శకులని అన్నారు. తన జీవితాన్ని పొగాకు కంపెనీలో గుమస్తాగా ప్రారంభించి, అంచెలంచలుగా ఎదిగి స్వయంకృషితో జాతీయ స్థాయికి చేరడం హర్షణీయమన్నారు. అభ్యుదయ వామపక్ష భావాలతో తన జీవితం మొత్తం కొనసాగుతుందన్నారు. పెనుగొండ లక్ష్మీనారాయణ విమర్శ వ్యాసాలు దీపిక కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. హిందూ కళాశాల తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ యల్లాప్రగడ మల్లికార్జున రావు ప్రసంగిస్తూ సాహిత్యానికి రచ్చబండ, వేల మిత్రులకు అండ, మా పెనుగొండ అని వారి సాహితీ సేవలను కొనియాడారు. పెనుగొండ వారి స్నేహభావంతో పూర్తిగా ప్రభావితమైన వ్యక్తినని తన అనుభవాలను పంచుకున్నారు. ఫోటోజనిక్ మెమొరీ పెనుగొండ లక్ష్మీనారాయణకు కలిగిన అద్భుత వరమని తెలిపారు. అరసం రాష్ట్ర కార్యదర్శి కె. శరత్ చంద్ర ప్రసంగిస్తూ అరసంలో సామాన్య సభ్యునిగా చేరి, 50 సంవత్సరాలు పయనించి జాతీయ అధ్యక్షులుగా ఎంపిక కావటం, నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాధించడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, ప్రముఖ సాహితీ వేత్తలు డాక్టర్ వి. సింగారావు, డాక్టర్ సూర్యదేవర రవికుమార్, కాట్రగడ్డ దయానంద్, సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్టు యూనియన్ నాయకులు నిమ్మరాజు చలపతి రావు, రచయిత సామాజిక విశ్లేషకులు టి.ధనుంజయ రెడ్డి, సీనియర్ న్యాయవాది గూడవల్లి నాగేశ్వరరావు, డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణకు శాలువా కప్పి, మెమెంటో అందించి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

ఇట్లు
వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
జన చైతన్య వేదిక
9949930670


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading