నారద వర్తమాన సమాచారం
కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలి: పవన్ కల్యాణ్
ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ
ఓర్వకల్లు దగ్గర 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు నెలకొల్పేందుకు ఒప్పందం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు
రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సంస్థ ఓర్వకల్లు దగ్గర 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్కు నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకొంది. ఇందుకు సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సి.ఈ.ఓ. విశ్వ ప్రసాద్ పవన్ కల్యాణ్‌కు వివరించారు.
వాహన తయారీ, ఆర్ అండ్ డి. కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలాంటివి ఇందులో ఉంటాయని చెప్పారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవి పార్కు అని తెలిపారు. దీని ద్వారా రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు కానుండటం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఇదొక మైలు రాయిగా అభివర్ణించారు. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి వచ్చే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భాస్కర రెడ్డి, రవికిరణ్ ఆకెళ్ళ, బాబ్ డఫ్ఫీ, స్టీవ్ గెర్బర్, హెరాల్డ్ రక్రిజెల్ ఉన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.