నారద వర్తమాన సమాచారం
డ్రగ్స్ రహిత జిల్లాగా పల్నాడును తీర్చి దిద్దుదాం: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు .
నరసరావు పేట,
పల్నాడును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో జిల్లాలో డ్రగ్స్ జాడ్యంపై పోరాటం చేయాలన్నారు.
కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి బాలలు – మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు నియంత్రణ చర్యలపై పోలీసు శాఖ, విద్యా శాఖ, ఎక్సైజ్ శాఖ, సాంఘిక సంక్షేమశాఖ, పంచాయతి రాజ్ శాఖ, సమాచార&పౌర సంబంధాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య,ఆరోగ్య శాఖ, రైల్వే మొదలగు శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ శాఖల అధికారులకు డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.
మెడికల్ షాప్స్ మరియు మద్యం దుకాణాల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలాన్నారు. లిక్కర్ షాపులు మరియు బార్లు పాఠశాలలకు దూరంగా తరలించాలన్నారు. విద్యాలయాల్లో క్యాంపస్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, పిల్లలు మరియు వారి తల్లిదండ్రులతో కలిసి కమిటీలు మరియు మీటింగ్ లు జరపాలని విద్యాశాఖను ఆదేశించారు.
డ్రగ్స్ నియంత్రణ కోసం మరికొన్ని ప్రత్యేక కౌన్సిలింగ్ విధానాలు, పునరావాస కేంద్రాలు, డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వసతి గృహాల్లో మనస్తత్వ నిపుణుల అవసరంపై ప్రభుత్వానికి నివేధించామన్నారు.
పోలీసులు స్కూల్స్, కాలేజీల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టడం, బాలలకు సంబంధించిన ప్రత్యేక విభాగం ఎస్ జె పి యు ద్వారా బాలలకు సంబంధించిన హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు.
రైల్వే పోలీస్ వారు తప్పిపోయిన మరియు వదిలివేయబడిన బాల బాలికలను బాలల సంక్షేమ కమిటీ వారి ముందు ప్రవేశపెట్టి వారికి సంబంధించిన విషయాలను వెబ్ సైట్ ద్వారా మిగిలిన అన్ని స్టేషన్స్ కు తెలియజేయాలన్నారు. సెబ్ అధికారులు వీటి నిర్మూలనపై విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రైల్వే శాఖాధికారులు గవర్నమెంట్, రైల్వే పోలీసు అధికారుల సమన్వయంతో పిల్లలతో మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వ్యక్తుల ములాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అలాగే ఔషద నియంత్రణాధికారులు మత్తును కలిగించే వివిధ ఔషదాలను పిల్లలకు అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖాధికారులు ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఛిద్రం అవుతుందో డాక్యుమెంటరీలు రూపంలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.
స్వచ్ఛంద సంస్థల ద్వారా పిల్లలకు తగిన సహాయం అందించాలని వారి సలహాలు సూచనలు తీసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తుని అందజేయాలని, కోరారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల నియంత్రణకి సంబంధించిన శాఖల ప్రధాన అధికారులతో సమీక్ష జరిపి తగు చర్యలు తీసుకోవాలని మరియు పిల్లలకు సంబంధించిన అంశాలలో సహాయం కావలసినవారు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయబడిన డిసిపియు ద్వారా బాలలకు రక్షణ మరియు సంరక్షణ అందించబడుతుందని తెలియజేశారు.
సమావేశంలో ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ పోలీసు శాఖ వైపు నుంచి మత్తు పదార్థాల నివారణపై మెరుగైన ప్రచార వీడియోలు రూపొందిస్తామన్నారు. మత్తుకు బానిసైన వ్యక్తులను నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని, డీ అడిక్షన్ కేంద్రాల సహకారంతో వారిని మామూలు మనుషులుగా మార్చే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.