నారద వర్తమాన సమాచారం
హైదరాబాదు నుండి శ్రీశైలంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రం అనుమతి
రూ.7,700 కోట్ల అంచనా వ్యయం
బ్రాహ్మణపల్లి నుంచి దోమలపెంట వరకు..
30 అడుగుల ఎత్తులో 62 కి.మీ. నిర్మాణం
24 గంటలూ రోడ్డుపై వాహన రాకపోకలకు అనుమతి
హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహార్దశ పట్టనుంది. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారిలో.. అమ్రాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లే 62 కిలోమీటర్ల దూరం(కల్వకుర్తి-శ్రీశైలం) రెండు లేన్ల ఘాట్లతో ఇరుకుగా ఉంటూ.. వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో మలుపుల వల్ల వన్యప్రాణులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పరిష్కారం లభించనుంది. ఈ కారిడార్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. 62 కిమీల మేర.. అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో నిర్మితమయ్యే ఈ రహదారి నిర్మాణానికి రూ.7,700 కోట్ల ఖర్చవుతుందని అంచనా.
అనుమతికి భారీ కసరత్తు
ఈ రహదారిలో అభయారణ్యం కారణంగా.. 62 కిమీల మేర రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి.. సీఎం రేవంత్‌రెడ్డి మూణ్నెల్ల క్రితం కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం విజ్ఞప్తి చేశారు. ”హైదరాబాద్-శ్రీశైలం రహదారి 125 కి.మీ మేర మంచి కండిషన్‌లో ఉంది. అయితే.. అమ్రాబాద్ అభయారణ్యంలో 62 కి.మీ. విస్తరణకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తే వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ కూడా సాఫీగా సాగిపోతుంది. ఈ కారిడార్ పూర్తయితే.. తెలంగాణ-ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుంది” అని గడ్కరీకి వివరించారు. ఆ తర్వాత కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ దిశగా అడుగులు వేసింది. రూ.7,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ కారిడార్‌కు కావాల్సిన భూసేకరణపై సర్వే చేయాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. దాంతో రాష్ట్ర అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మితమైతే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటూ గతంలో ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.
ప్రయాణ ఇక్కట్లు దూరం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కుంచోనిమూల, దుర్వాసుల చెరువు ఫరహాబాద్, వటువర్లపల్లి, దోమలపెంట గిరిజన గ్రామాల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళ్తుంది.
ప్రాజెక్టులో భాగంగా దోమలపెంట-శ్రీశైలం మధ్య కృష్ణానదిపై సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించాలి.
ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరం. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయి.
వన్యప్రాణులకు ఇబ్బందులు లేకుండా.. వృక్ష సంపదకు పెద్దగా నష్టం కలుగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తారు.
ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయి.. అందుబాటులోకి వస్తే.. ప్రయాణ ఇక్కట్లు దూరమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాత్రి వేళల్లో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తులో ఉండే కారిడార్ వల్ల.. ఆ నిషేధాన్ని ఎత్తివేయవచ్చు.
ఎత్తులో కారిడార్ ఉండడం వల్ల.. వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత కలుగుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.