ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి … కమిషనర్ పులి శ్రీనివాసులు
నారద వర్తమాన సమాచారం
గుంటూరు:-
పర్యావరణం, ప్రజారోగ్యానికి భంగంగా పరిణమించిన నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని గుంటూరు నగరంలో జిఎంసి ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది, ప్రజలు సంయుక్తంగా కృషి చేస్తేనే నిలువరించగలమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. బుధవారం స్థానిక రెవెన్యూ భవన్ లో ఐటిసి మిషన్ సునేహరకల్, బంగారు భవిష్యత్ ఆధ్వర్యంలో గుంటూరు నగరపాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులకు ప్లాస్టిక్ నిషేధం, వ్యర్ధాల నిర్వహణ, హోమ్, క్లస్టర్ కంపోస్ట్ తయారీ అంశాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి, పర్యావరణానికి పెను భూతంలా తయారైందని, ప్రజలందరీ భాగస్వామ్యం ద్వారానే నిషేదించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్చ ఆంద్ర కార్యకమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక అంశాన్ని ప్రాతిపదికగా మెగా పారిశుధ్య పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ నెల ప్లాస్టిక్ నిషేదంపై కార్యకమాలు చేయాలని ఆదేశించిందన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మెగా పారిశుధ్య పనుల నిర్వహణ, పర్యవేక్షణ కోసం 57 మంది ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ప్రజారోగ్య కార్మికులు, కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, పర్యవేక్షణ అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం, తడిపొడిగా వ్యర్ధాలు విభజన, కంపోస్ట్ తయారీపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. ఐటిసి సంస్థ ఇప్పటికే నగరంలో పలు వార్డ్ ల్లో వ్యర్ధాల విభజన, హోం, క్లస్టర్ కంపోస్ట్ తయారీపై ప్రజల్లో విరివిగా అవగాహన కల్గిస్తుందన్నారు. అవసరమైతే వారి సహకారంతో నగరంలో అన్ని వార్డ్ ల్లో కంపోస్ట్ తయారీ, పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు తగిన అవగాహన కల్గించాలన్నారు. శిక్షణలో పారిశుధ్యం, వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేదం వంటి కీలకమైన అంశాలపై నిపుణులు అందించే సూచనలు, సలహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రద్దగా నోట్ చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ స్టేట్ ప్రమోటింగ్ ఆఫీసర్ కృష్ణవీరవర్మ, స్వచ్ఛ భారత్ మిషన్ రిసోర్స్ పర్సన్ సునంద, ఏఎన్యు ఎన్విరాన్మెంట్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ బ్రహ్మాజి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, గ్రీన్ కోర్ జిల్లా భాధ్యులు తిరుపతి రెడ్డి, ఐటిసి మిషన్ సునేహరకల్, బంగారు భవిష్యత్ నుండి నారాయణ బృందం, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.