నారద వర్తమాన సమాచారం
అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష పార్టీల నాయకులు
మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తీర్మానం
భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ పై అఖిలపక్ష సమావేశంలో ప్రణాళిక
మాచర్ల :
మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింకన్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కొమెరా వీరాస్వామి భవన్ లో గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ… 20 ఏళ్లుగా కొద్దిపాటి జీతంతో పుర ప్రజలకు సేవలందిస్తున్న మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను ఉద్యోగాల నుండి అకారణంగా తొలగించటం బాధాకరమన్నారు. పొట్టకూటి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ సమయంలో ప్రజలకు సేవలందించిన కార్మికులను ఎలా తొలగిస్తారో పాలకులు సమాధానం చెప్పాలన్నారు. పలువురు కార్మికులు నాటి వైసిపి పెద్దల ఇళ్లలో అప్పుడు పని చేశారనే నెపంతో ఇప్పుడు వారి పొట్ట గొట్టడం సరి కాదన్నారు. దీంతో ఆ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరు ఉద్యోగులతో చెలగాటమాడటం మంచిది కాదని హితవు పలికారు. నాడు చిన్న కాన్వెంట్ ఎదురు అఖిలపక్షం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో .. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు. అనంతరం పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులకు మున్సిపల్ కార్మికులుగా పేర్లు నమోదు చేసి అధికారులు లక్షలాది రూపాయలు వారికి కట్టబెట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాయితీగా పని చేసిన కార్మికులపై ఆంక్షలు విధించి, విధులకు రావొద్దంటూ హుకుం జారీ చేయడంలో అర్థం లేదన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించి విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయక తప్పదని వారు హెచ్చరించారు. సమావేశంలో ఎంసిపిఐయు నాయకులు మాచవరపు నాగేశ్వరరావు, ఏఐవైఎఫ్ నాయకులు నర్రా రంగస్వామి, మాచర్ల కుమార్, బి ఎస్ పి నాయకులు గుండాల సైదులు, గురజాల అప్పారావు, ఏఐటీయూసీ నాయకులు మిద్దెపోగు బాబురావు, ఎస్ఎండి భాషా మేస్త్రి, విష్ణు మొలకల అప్పారావు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.