నారద వర్తమాన సమాచారం
డ్రగ్స్ నివారణ కోసం ఈగల్ క్లబ్స్ : జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట,
జిల్లాలో ఈగల్ క్లబ్స్ ద్వారా డ్రగ్స్ నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. ప్రతి కళాశాలలో ఔత్సాహిక విద్యార్థులు, తల్లిదండ్రులతో ఈగల్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు కార్యక్రమాలు చేపడతామన్నారు. డ్రగ్స్ వినియోగంపై ఈగల్ క్లబ్స్ సమాచారం అందిస్తాయన్నారు.
శనివారామం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు నార్కోటిక్స్ నియంత్రణ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఆహ్లాదం కోసం కాలేజీ విద్యార్థులు అవలంబిస్తున్న నూతన మార్గాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల ప్రవర్తనపై అవగాహన కోసం పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘డ్రగ్స్ వద్దు బ్రో ‘ అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.
హైవేలపై అనుమాస్పద ప్రాంతాల్లో వాహనాల నిలుపుదల, పాన్ షాపుల వద్ద అసాధారణ అమ్మకాలను గుర్తించాలన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం జిల్లా వైద్యశాలలో డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణ ప్రియ, ఆర్డీవోలు మధులత, మురళీ కృష్ణ, డీఎంహెచ్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.