నారద వర్తమాన సమాచారం
భారత్‌లోనూ భూప్రకంపనలు..
భయంతో జనాల పరుగులు
ప్రకృతి విలయాలు మిగిల్చే విషాదం అంతా ఇంతా కాదు. వీటి కారణంగా సొంత వాళ్లను కోల్పోయి రోడ్డున పడ్డ వారెందరో. ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి, ధన నష్టం కూడా వాటిల్లుతుంది. అందుకే భూకంపాలు, సునామీలు లాంటి ప్రకృతి విలయాల మాట ఎత్తితే సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా భయపడతాయి. ఇప్పుడు ఒకేసారి ఐదారు దేశాల ప్రజల్ని భూకంపాలు వణికేలా చేస్తున్నాయి. భారత్‌తో పాటు మయన్మార్, థాయ్‌లాండ్, చైనా లాంటి దేశాల్లో వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మన దేశంలో మేఘాలయ, ఇంఫాల్‌లో ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.
అన్ని సర్వీసులు బంద్
తొలుత మయన్మార్‌లో భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో వందల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. వాటి కింద వేలాది మంది చిక్కుకున్నారని సమాచారం. మండేల్‌లోని చారిత్రక అవా బ్రిడ్జి నేలమట్టమైంది. ఒక భవనంలోనైతే 43 మంది వరకు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో భూప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో బ్యాంకాక్‌లోని భవనాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. అక్కడి ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు. రైల్వేతో పాటు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశారు. ఈ భూప్రకంపనల ఎఫెక్ట్ కాస్తా ఇండియాకు పాకింది. మన దేశంలోని మణిపూర్, మేఘాలయలో భూమి కంపించడంతో వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. కోల్‌కతా, ఢిల్లీలోనూ భూమి కంపించింది. మేఘాలయలో భూకంప తీవ్రత 4.0గా నమోదైంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.