నారద వర్తమాన సమాచారం
అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!!
తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో తిరుమల విజన్-2047 అమలు దిశగా కార్యాచరణ సిద్దం అవుతోంది. అందులో భాగంగా అలిపిరి వద్దే బేస్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. 15 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం అయ్యాయి. అలిపిరి వద్దే ప్రయివేటు వాహనాలను నిలిపి ఎలక్ట్రిక్ బస్సుల్లో కొండ పైకి తీసుకెళ్లనున్నారు. అలిపిరి వద్దే వసతితో పాటుగా అన్ని కౌంటర్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
అలిపిరి వద్ద బేస్ క్యాంపు
తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ మరో ప్లాన్ అమలుకు సిద్దమైంది. అలిపిరి వద్ద బేస్ క్యాంపు ఏర్పాటుకు ప్రణాళికలు ఖరారయ్యాయి. అలిపిరి వద్దే భక్తులకు వసతితో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నారు. దీని ద్వారా దర్శనం కోసం వెళ్లే భక్తులు అన్ని రకాల సేవలు అలిపిరిలోనే పొందే అవకాశం కలుగుతుంది. తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీ తగ్గించేందుకు వీలుగా కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలతో పాటుగా వాహన రద్దీ, కాలుష్యం తగ్గించేలా బేస్ క్యాంపులో సౌకర్యాలు కల్పిస్తున్నారు. సైలెంట్ జోన్‌లో ఉండాల్సిన తిరుమల కమర్షియల్ జోన్‌లోకి వెళ్లిపోయింది. తిరుమలలో రోజుకు సగటున 68 వేల మంది భక్తులతో పాటు 20 వేల మంది స్థానికులకు నీటి, విద్యుత్ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా మారుతోంది.
అన్ని వసతులతో ఏర్పాటు
తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రధానంగా తిరుమలలో 7,790 టీటీడీ గదులు, 1,105 మఠా ల గదులు, 6,800 లాకర్లు ఉన్నాయి. వీటి ద్వారా కేవలం 55 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంటోంది. మిగిలిన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సవాళ్లను ఎదుర్కోవడం కోసమే టీటీడీ బేస్‌క్యాంప్ ప్రాజెక్ట్‌పై ప్రధాన దృష్టిసారించింది. తిరుమల విజన్- 2047లో భాగంగా అలిపిరిలో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని భావించి ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. దీనికోసం 10 నుంచి 15 హెక్టార్ల స్థలాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకే కేటాయించడంతో బేస్‌క్యాంప్‌కు లైన్ క్లియర్ అయింది. ఇటీవల టీటీడీపై సమీక్షలో ఈబేస్ క్యాంప్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచీ గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇక పనులు వేగంవంతంగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
బేస్‌క్యాంప్‌లో ఏముంటాయి..
25 వేల మంది భక్తులకు సకల సౌకర్యాలతో వసతి కల్పించేదిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి చేరే ప్రైవేట్ వాహనాలను ఈ బేస్‌క్యాంప్‌కు మళ్లించి వాటిలో వచ్చిన భక్తులను టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా తిరుమలకు పంపేందుకు ప్రత్యేక కేంద్రం.. మోడల్ ట్రాన్స్‌ఫర్ టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. భక్తులు విశ్రాంతి తీసుకునేం దుకు, స్నానాలు చేసేందుకు, భోజనం హాళ్లు, లాకర్లు వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఇక, భక్తులకు వసతి కేటాయింపు కార్యాలయాలతో పాటు వివిధ రకాల కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మ్యూజియం, కళాప్రదర్శన కేంద్రం, ఆధ్యాత్మికతను పెంచేలా వివిధ రకాల ఏర్పాటు ఉంటాయి. కొండపై వాహన కాలుష్యం తగ్గించడంతో పాటు నీటి, విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించే అవకాశం కలుగుతుంది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. దీంతో, సాధ్యమైనంత త్వరగా ఈ బేస్ క్యాంపు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.