నారద వర్తమాన సమాచారం
యోగాంధ్రకు మహా సన్నాహాలు
- ప్రధాని పాల్గొనే కార్యక్రమం.. విజయవంతం చేయండి!
- ప్రతి శాఖ సమన్వయం అవసరం
- ఇన్‌చార్జి మంత్రి శ్రీనివాస్, మంత్రి అచ్చెన్న
‘‘ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే విశాఖపట్నంలోని యోగాంధ్ర 2025 కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవం. ఎలాంటి లోపం లేకుండా దీనిని విజయవంతం చేయాలి. ప్రతి శాఖ సమన్వయంతో, సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలి’’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, యోగాంధ్ర ఇన్‌చార్జిలు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు లక్ష్యం
‘‘ఇది సాధారణ కార్యక్రమం కాదు.. గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించే మహా కార్యక్రమం. ప్రధాని మోదీ ‘యోగా’ను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేసిన నేపథ్యంలో, ఆయన అగ్ర నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో యోగా ఉత్సవం జరగడం గర్వకారణం. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్రాన్ని అభ్యర్థించి ఈ అవకాశాన్ని తెచ్చారు. దీనిని దిగ్విజయం చేయడమే లక్ష్యంగా పని చేయాలి” అని మంత్రులు వ్యాఖ్యానించారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి 20 వేల మంది :
శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకు వెళ్లే ప్రణాళికలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా నుంచే 20 వేల మంది విశాఖ కార్యక్రమానికి వెళతారని కలెక్టర్ తెలిపారు. 150 ఆర్టీసీ, 400 ప్రైవేట్ బస్సులు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 15 వేల మంది సామాన్య ప్రజలు కాగా, మిగతా 5 వేల మంది ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులు ఉంటారన్నారు. భీమిలి స్పాట్ జిల్లాకు కేటాయించగా, అక్కడే వేదిక వద్ద అల్పాహారం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్యాకేజ్డ్ భోజనం అందజేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు.
మరుగు దొడ్లు – ట్రాఫిక్ కీలకం
ట్రాఫిక్ నియంత్రణ, మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 9 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని, పైడి భీమవరం దాటి జిల్లాలోని ప్రజలకు దాబాలు, పెట్రోల్ బంకులు, నేషనల్ హైవే టాయిలెట్ల వద్ద శుభ్రమైన వసతులు కల్పించనున్నట్టు వివరించారు.
జిల్లాలోనే లక్షల మంది భాగస్వామ్యం
జిల్లాలో వివిధ శాఖల భాగస్వామ్యంతో, ఆయుష్ శాఖ పర్యవేక్షణలో యోగా పై ఇప్పటికే ప్రత్యేక శిక్షణలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర 2025 కోసం జిల్లాలో 6,500 వేదికలు గుర్తించగా, అందులో 3,500 పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లాలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈనెల 21న కార్యక్రమంలో పాల్గొంటారని.. మొత్తం 10 లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలన్నదే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.