నారద వర్తమాన సమాచారం
పల్నాడు లో 11″వ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి
యోగ ముద్రతో నిద్దుర లేచిన పల్నాడు
గ్రామ గ్రామాన వెల్లివిరిసిన యోగ సమ్మేళనాలు
కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో 10,000 మందితో యోగా
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు కలిపి 5,000 పైచిలుకు ప్రాంతాల్లో సామూహిక యోగా కార్యక్రమాలు- భాగస్వాములైన 5 లక్షల మంది
నరసరావు పేట,
జిల్లాలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం పల్నాటి జిల్లా పల్లెలు యోగ ముద్రతో నిద్దుర లేచాయి. గ్రామ&వార్డు సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో కలిపి 5,000 వేదికల వద్ద దాదాపు 5 లక్షల మంది ప్రజలు సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనం మరిచిపోయిన యోగాను తిరిగి ప్రజలకు పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం చేపట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సఫలమైంది. నెల రోజుల పాటూ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర యాప్ ద్వారా 10 లక్షల మంది ఔత్సాహికులను నమోదు చేసి, ఇంటింటికీ వెళ్లి యోగా అవశ్యకతను వివరించింది.
కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో జిల్లా స్థాయి కార్యక్రమం
స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లా స్థాయి 11వ అంతర్జాతీయ స్థాయి వేడుకలు నిర్వహించారు. 10,000 మందితో యోగ సమ్మేళనం నిర్వహించి నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమానికి ముగింపు పలికారు. ఒక వైపు విశాఖపట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ యోగాసనాలు వేశారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్ పర్సన్ గోనుగుంట్ల వెంకటేశ్వర రావు, డీఆర్వో మురళి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కనీ వినీ ఎరుగని రీతిలో యోగా దినోత్సవ వేడుకలు: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
జిల్లా వ్యాప్తంగా 9.97 లక్షల మందిని యోగా ఔత్సాహికులుగా నమోదు చేసి, 5,000 వేదికల వద్ద దాదాపు 5 లక్షల మందితో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని ఘట్టమని, అది అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు సాకారమైందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వ్యాఖ్యానించారు.
ప్రపంచం వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న యోగాను మనం మరిచిపోవడం బాధాకరమన్నారు. యోగాంధ్ర అనంతరం సైతం ప్రజలు యోగాను విడిచిపెట్టకుండా రోగాలను దూరం చేసుకోవాలని, ప్రశాంతతను ఆహ్వానించాలని కోరారు. యోగాంధ్ర, యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రజానీకం, అధికార యంత్రాంగం, గ్రామ&వార్డు సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత పొందడానికి, తప్పుడు మార్గంలో నడిపించే బలహీనతలు జయించడానికి యోగా తోడ్పడుతుందన్నారు.
యోగాపై పేటెంట్ మనదే: ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు
యుగయుగాలుగా మన సంస్కృతిలో భాగమైన యోగాను అంతర్జాతీయ దినోత్సవం నాడు గిన్నిస్ రికార్డు నెలకొల్పే విధంగా నిర్వహించి యోగాపై పేటెంట్ మనదే అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రపంచానికి చాటి చెబుతున్నారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.
నెల రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న శిక్షకులను సత్కరించి, జిల్లాలో నిర్వహించిన యోగా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఎంపీ నేతృత్వంలో అమరావతి బౌద్ధ స్థూపం వద్ద యోగ సమ్మేళనం
అమరావతిలో చారిత్రక కట్టడమైన బౌద్ధ స్థూపం వద్ద 2000 మందితో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వం వహించారు.
ఆధునిక భారతదేశ సమస్యలకు పరిష్కారం యోగా: ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
ఒకనాడు భారత దేశంలో ఆకలి ప్రధాన సమస్యగా ఉండేదని, ఆధునిక భారతదేశంలో మాత్రం మానసిక ప్రశాంతత లేకపోవడం, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు సమస్యలుగా మారాయన్నారు. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా సరైన మార్గం అని తెలిపారు.
భారత దేశంలో పుట్టిన యోగాకు కేవలం మన దేశంలో మాత్రమే గాక అంతర్జాతీయ స్థాయిలో ఒక దినోత్సవాన్ని నిర్వహించుకునేలా చేసిన నాయకుడు నరేంద్ర మోడీ అని, అదే రోజు రికార్డు స్థాయిలో మన రాష్ట్రంలో వేడుకలు నిర్వహించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంతో సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థూపం సమీపంలో మొక్కను నాటి ఆహ్వానితులతో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి, ఆర్కియాలజికల్ సర్వే, సాంస్కృతిక శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.