నారద వర్తమాన సమాచారం
ప్రపంచ ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్
ప్రపంచ దేశాలకు రెండు అతి పెద్ద సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఒకటి పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాల ఉత్పత్తి, మరొకటి ఇంధన అవసరాలు. ప్రస్తుతానికి చాలా దేశాల్లో ఆహార కొరత తీరిపోయింది. ఆఫ్రికాలో ఇంకా కొన్ని దేశాలు ఆహార కొరతను అధిగమించాల్సి ఉంది. అయితే రాబోయే పదేళ్లలో శిలాజ ఇంధనాలు అంతరించిపోయే దశకు చేరుకోబోతున్నాయి. దీంతో పలు దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాయి. సౌర విద్యుత్, పవన విద్యుత్, అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు, గ్రీన్ హైడ్రోజన్ తయారీపై పరిశోధనలు చేస్తున్నాయి. కొంత వరకు సత్ఫలితాలిచ్చినా, ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు ద్వారా పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి పెద్ద ఎత్తున చేపట్టేందుకు డిక్లరేషన్ ప్రకటించింది. పలు రాయితీలు అందించాలని నిర్ణయించారు. ఆ వివరాలు పరిశీలిద్దాం.
అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ద్వారా 2030 నాటికి ఏపీకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2027 నాటికి ఎలక్ట్రోలైజర్ తయారీ సామర్థ్యం 2 గిగావాట్లు, 2029 నాటికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం లీటరు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి రూ.460 ఖర్చు అవుతోంది. దీన్ని 2029 నాటికి రూ.160కి తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం. ఇందుకు పెద్ద ఎత్తున పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పరిశోధనలకు రూ.500 కోట్లతో ఆవిష్కరణ నిధి ఏర్పాటు చేశారు.
2030 నాటికి దేశీయంగా ఎలక్ట్రోలైజర్ తయారీతోపాటు దాని నిల్వకు పరిష్కారాలను కనుగొంటారు. ఇందుకు కనీసం 50 స్టార్టప్ కంపెనీలకు రూ.500 కోట్ల సాయం అందిస్తారు. ఇందుకు పలు యూనివర్శిటీల సహకారం కూడా తీసుకోనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. మచిలీపట్నంలో గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటుకు రూ.35 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యామీ సంస్థ ముందుకు వచ్చింది. ఇక కృష్ణపట్నంలో రూ.16 వేల కోట్లతో అమ్మోనియా ఉత్పత్తికి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ పోర్టు సమీపంలో గ్రీన్ కో కూడా భారీ పెట్టుబడులకు సిద్దం అవుతోంది.
స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా ఉంచడం, దాని విస్తృత తీరప్రాంతం, పునరుత్పాదక ఇంధన వనరులు, పెరుగుతున్న పారిశ్రామిక స్థావరాన్ని పెంచడం ఈ డిక్లరేషన్ ప్రధాన లక్ష్యం. గ్రీన్ హైడ్రోజన్ అనేది క్లీన్, పునరుత్పాదక ఇంధన వనరు, ఇది గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గిస్తుంది. వాతావరణ మార్పులను తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది.సౌర, పవన లేదా జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్ అవసరాలను తీర్చనుంది.
గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు?
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రధానంగా కావాల్సిన ఇంధనం చౌకైన విద్యుత్. అది కూడా కాలుష్యం ఉత్పత్తి చేయకుండా జరిగే విద్యుత్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. నీటి అణువులను హైడ్రోజన్ , ఆక్సిజన్‌గా విభజించడానికి పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగిస్తారు. నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్, నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది, ఇది స్వచ్ఛమైన శక్తి వనరు. గ్రీన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా, శక్తి నిల్వ మాధ్యమంగా లేదా పారిశ్రామిక ప్రక్రియలకు ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగించవచ్చు.
గ్రీన్ హైడ్రోజన్ ప్రయోజనాలు
గ్రీన్ హైడ్రోజన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జీరో కాలుష్యం దీని ప్రత్యేకత. దీని ఉత్పత్తిలో విడుదలయ్యే నీటి ఆవిరి, ఆక్సిజన్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదు. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, దేశానికి ఇంధన భద్రతను పెంచుతుంది.గ్రీన్ హైడ్రోజన్ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. రవాణా వాహనాలకు కూడా ఇంధనంగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయ ఇంధన వనరులతో పోలిస్తే దీని ద్వారా ఎలాంటి కాలుష్యం విడుదల కాదు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణాలో అనేక సవాళ్లు ఉన్నాయి. పలు ప్రయోజనాలు ఉన్నా ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతానికి లభిస్తోన్న ఇంధన వనరులతో పోల్చుకుంటే ఇది చాలా ఖరీదైనది. ముడిచమురుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించాలంటే దీని ధర 300 శాతం తగ్గాల్సి ఉంది. ఇందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసిన తరవాత నిల్వ చేయడం, దాన్ని తరలించడం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీన్ని ప్రస్తుతానికి సిలిండర్లలో నిల్వ చేస్తున్నాయి. భారీగా ఉత్పత్తి ప్రారంభిస్తే దీన్ని నిల్వ చేయడం ఎలా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం జర్మనీ, జపాన్, అమెరికా, చైనాలాంటి దేశాలు పలు పరిశోధనలు చేస్తున్నాయి. జర్మనీలో గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంతో ఓ ప్రయాణీకుల రైలును విజయవంతంగా నడుపుతున్నారు. రాబోయే కొద్ది నెలల్లో భారత్ కూడా ఇలాంటి ప్రయోగం చేయబోతోంది. గ్రీన్ హైడ్రోజన్ అందుబాటు ధరలో అందరికీ అందుబాటులోకి వస్తే దేశాల ఇంధన అవసరాలు తీరుతాయి. ఇంధన భద్రత లభిస్తుంది. పలు దేశాలు ఆర్థికంగా ప్రయోజనం పొందుతాయి. ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడే భారత్‌లాంటి దేశాలకు ఇది వరంగా మారనుంది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.