నారద వర్తమాన సమాచారం
జిల్లా కలెక్టర్ చొరవతో ప్రారంభం కానున్న పాఠశాల
రామాంజనేయపురం తాండా వాసుల విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్
అధికారులతో కలిసి గ్రామస్తులతో రచ్చబండ ఏర్పాటు
గిరిజన గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ
నరసరావు పేట, ఆగస్టు 26
మా పిల్లలు మా గ్రామంలోనే చదువుకునేలా చూడండి అంటూ బెల్లంకొండ మండలం, రామాంజనేయపురం తాండావాసుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చలించిపోయారు. అటవీ ప్రాంతంలో రోడ్లు, ఇతర వసతులు లేకపోవడంతో పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా ఉందని గిరిజనులు వాపోవడంతో వెంటనే గ్రామాన్ని సందర్శించి సమస్యల పరిష్కారానికి నడుం కట్టారు.
గ్రామదదర్శిలో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న పాఠశాల భవనంలో వెంటనే తరగతులు ప్రారంభమయ్యాలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి అనంతరం పాఠశాలను ప్రారంభించుకుందామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
అనంతరం గ్రామంలోని ప్రజలు, అధికారులతో కలిసి నేలపై కూర్చొని రచ్చబండ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా తమ గ్రామానికి అధికారులంతా తరలిరావడం, అందరితో పాటూ అధికారులందరూ నేలపై కూర్చొని సమస్యలు వినడమే గాక సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంపై గ్రామప్రజలు సంతోషం వెలిబుచ్చారు. గ్రామానికి సరైన రోడ్డు వసతి లేకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి, వైద్య సేవలలో ఇబ్బందులు, తాగునీటి సమస్యలు, జ్వరాలు వంటి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామానికి రోడ్డు వసతి కోసం వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రహదారులు& భవనాలు శాఖ అధికారులను ఆదేశించారు. పీఎం సూర్యఘర్ ద్వారా గ్రామంలోని గిరిజనుల ఇళ్లకు వంద శాతం సబ్సిడీతో సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సరఫరా కోసం ఆర్వో ప్లాంటును నిర్మించాలని డీపీవోను ఆదేశించారు. వారంలో మూడు రోజులు డ్రైడే నిర్వహించాలని, వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి సేవలు అందించాలన్నారు. సర్వే నిర్వహించి గ్రామ కంఠం హద్దులు తేల్చాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి, డీఈవో చంద్రకళ, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.