నారద వర్తమాన సమాచారం
నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే.. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు
మనం పాలకులు కాదు, ప్రజలకు సేవకులం
సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్
అహంకారం, అవినీతి, అలసత్వం దరికి రానివ్వొద్దు
నాది, పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటే
రాష్ట్రానికి ప్రధాని మోదీ అన్ని విధాలా అండగా ఉన్నారు
సంక్షేమం, అభివృద్ధి రెండూ సూపర్ హిట్ చేస్తాం
‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో చంద్రబాబు
“మనం పాలకులం కాదు, ప్రజలకు సేవకులం. ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్” అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. దర్జాలు, ఆర్భాటాలు ప్రదర్శించడం కుదరదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అహంకారం, అవినీతి, అలసత్వం వంటివి దరిచేరనివ్వొద్దని గట్టిగా సూచించారు.
బుధవారం అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభలో ఆయన మాట్లాడుతూ, తన ఆలోచన, మిత్రపక్ష నేత పవన్ కల్యాణ్ ఆలోచన ఒక్కటేనని, రాష్ట్ర పునర్నిర్మాణం, ప్రజలకు న్యాయం చేయడమే తమ ఏకైక ధ్యేయమని స్పష్టం చేశారు. “మాకు ఈ ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజల భవిష్యత్తే మాకు ముఖ్యం” అని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యే, కార్యకర్త లేదా అధికారి తప్పు చేసినా, ఆ చెడ్డపేరు ప్రభుత్వానికే వస్తుందని, అందుకే ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రానికి మంచి చేయాలనే తమ సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈ సహకారానికి ప్రధానమంత్రి మోదీకి ఆయన వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. మూడు పార్టీల కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా పాలన అందిస్తామని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటేనే బలం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పేదరికం లేని సమాజం కోసం తన శక్తిమేర శ్రమిస్తానని, ‘హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ సాధనే తన లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సూపర్ హిట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. “వైకుంఠపాళి ఆట వద్దు. నిరంతర పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.
తాను 47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానని చంద్రబాబు అన్నారు. రామరాజ్యం లాంటి పాలన ఇచ్చే బాధ్యత తనది, పవన్ కల్యాణ్‌ది అన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నామని, అన్నీ చేస్తామని, సహకారం కావాలని కోరారు. కలిసి పోటీ చేశాం.. కలిసి గెలిచాం.. కలిసి పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతోని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.