నారద వర్తమాన సమాచారం
జోగి రమేశ్ గృహ నిర్బంధం.. ఉద్రిక్తత
ఫ్లయాష్ డంపింగ్ యార్డుకు వెళ్లేందుకు జోగి రమేశ్ యత్నం
జోగి రమేశ్ ను అడ్డుకున్న పోలీసులు
పలువురు నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫ్లయాష్ డంపింగ్ యార్డు పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ పరిణామంతో ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. మూలపాడులోని వీటీపీఎస్ ఫ్లయాష్ డంపింగ్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భారీగా ఫ్లయాష్‌ను అక్రమంగా నిల్వ చేశారని జోగి రమేశ్ ఆరోపిస్తున్నారు. ఆ ఫ్లయాష్‌ను స్థానిక లారీ యజమానులకు పంచుతానని ఆయన గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగా, ఈ రోజు పార్టీ శ్రేణులతో కలిసి ఆ యార్డుకు వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జోగి రమేశ్ నివాసం వద్దకు భారీగా చేరుకుని, ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రిని గృహ నిర్బంధం చేశారన్న విషయం తెలియగానే, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళన చేస్తున్న పలువురు వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యానులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం జోగి రమేశ్ నివాసం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.