నారద వర్తమాన సమాచారం
విజయాలకు విజయదశమి శుభారంభం కావాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు.,ఐపీఎస్.,
విజయదశమి పండుగను పురస్కరించుకొని ఘనంగా ఆయుధాలు మరియు వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ
ప్రజా భద్రత కోసం పోలీసులు అహర్నిశలు కష్టపడి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో అనివార్యంగా ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు విజయదశమి సందర్భంగా గురువారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు సతీసమేతంగా పాల్గొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ఆయుధ పూజను శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీకగా భావించే విజయదశమి పర్వదినాన, ఆయుధ పూజను సంప్రదాయబద్ధంగా జిల్లా ఎస్పీ గారు తెలుగు సంప్రదాయక దుస్తులు ధరించి వేద మంత్రాల నడుమ నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తమ విధుల్లో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదంటూ ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులకు ఆయుధాలతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని, పోలీసు వ్యవస్థలో ప్రతీవ్యక్తి ఆయుధాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. మనిషిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసే వాహనాలకు అంతే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే,గతంలో ప్రకాశం జిల్లాకు మంచి పేరు ఉందని గుర్తు చేస్తూ, మనందరం కలిసికట్టుగా పనిచేసి ఇంకా ప్రకాశం పోలీస్ శాఖకు మరింత మంచి పేరు తీసుకొని రావాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది సఫలీకృతమవ్వాలని, జిల్లా పోలీసు శాఖ అన్ని విషయాలలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ప్రకాశం జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బంది మరియు ప్రజలకు, యావన్మందికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని,ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విధులు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ చంద్ర శేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్, ఒంగోలు తాలూకా సిఐ విజయ కృష్ణ, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, CCS సీఐ జగదీష్, ఆర్ఐలు రమణా రెడ్డి, సీతారామరెడ్డి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.