నారద వర్తమాన సమాచారం
మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!
పూవర్తికి చేరని హిడ్మా మృతదేహం
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హిడ్మా తల్లి
ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా వెలుగొందిన పూవర్తి.. మూగబోయింది. హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఆయన సొంతూరు పూవర్తిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఛత్తీ్‌సగఢ్ సుకుమా జిల్లాలోని పూవర్తి మావోయిస్టు పార్టీ రాజధానిగా 2024 వరకు వెలుగొందింది. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు పార్టీలో పని చేశారు. మంగళవారం మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పూవర్తిలో నెలకొన్న పరిస్థితిని కవర్ చేసేందుకు మీడియా ఆ గ్రామాన్ని సందర్శించారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి.. ఛత్తీ్‌సగఢ్‌లోని పామేడు, కౌరుగట్టు, కొండపల్లి, చిన్నబట్టిగూడెం గ్రామం మీదుగా 3 గంటల పాటు అడవిలో ప్రయాణించి పూవర్తికి చేరుకున్నారు. పూవర్తిలో 8 వీధులుండగా.. బండిపారలో హిడ్మా ఇల్లు ఉంది. అన్ని వీధుల్లో సగం ఇండ్లకు తాళాలే కనిపించాయి. కొందరు ఇళ్ల వద్ద దిగాలుగా కూర్చుని ఉన్నారు. మరికొంతమంది హిడ్మా ఇంటి వద్దకు చేరుకుని చెట్ల కింద కూర్చుని కనిపించారు. బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహం పూవర్తికి చేరుకోలేదు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి మాంజు.. ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ కనిపించారు. హిడ్మా మృతిచెందిన విషయం సెల్‌ఫోన్‌లో చూశామని, ఫొటో చూశాక హిడ్మానే అని పోలీసులకు చెప్పామని గ్రామస్థులు చెప్పారు. హిడ్మా మృతదేహం గురువారం తీసుకొస్తారని తెలిపారు.
హిడ్మా కాదు దేవా..
హిడ్మా అసలు పేరు దేవా అని, హిడ్మా ఆయన తండ్రి పేరని గ్రామస్థులు చెప్పారు. హిడ్మా చిన్నప్పుడే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడన్నారు. హిడ్మాకు అక్క బుద్రి, అన్న మూయా, చెల్లెల్లు కోసి, దేవే, ఉంగి ఉన్నారని.. ఓ ఎన్‌కౌంటర్‌లో అన్న చనిపోయాడని వెల్లడించారు. హిడ్మాను ఐదేళ్ల క్రితం చూశామని కొంతమంది.. గ్రామంలో క్యాంప్ పెట్టక ముందు చూశామని మరికొందరు తెలిపారు. హిడ్మా గ్రామానికి వచ్చినా బయట కనపడేవాడు కాదని, గతంలో భార్యతో వచ్చినప్పుడు చూశామని మరికొందరు చెప్పారు. గ్రామస్థులకు తన వంతుగా సాయం కూడా చేసేవాడని, ఆపద అంటే ఆదుకునేవాడని 60ఏళ్లు పైబడిన ఓ వృద్ధుడు తెలిపాడు. హిడ్మా ఇంటి పక్కన, మావోయిస్టుల సమావేశాలకు కట్టిన ఒక ఇల్లు, అతడి అన్న మృతి అనంతరం నిర్మించిన స్మారక స్తూపాన్ని కేంద్ర బలగాలు తొలగించాయి..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







