నారద వర్తమానం సమాచారం
అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రాంతం ఎంత ప్రేమ చూపిస్తుందో.. అంతే పోరాటాన్ని కూడా చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులూ ఎన్నో పోరాటాలు చేశారని.. గతంలో నిజాం సర్కార్ కు సైతం ఎదురొడ్డి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందని సీఎం రేవంత్ చెప్పారు.
గద్దర్, గోరేటి వెంకన్న వంటి ఉద్యమకారులు తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని రూపకల్పన చేశారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. బడికి వెళ్లని అందె శ్రీ.. జయ జయ హే తెలంగాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉందని రేవంత్ తెలిపారు. ‘బాధతో.. ఉద్వేగంతో చెప్తున్నా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని కోరుకున్నారు. ఉద్యమంలో ప్రతి నాలుక మీద, ప్రతి వేదిక మీద జయ జయ జయహే తెలంగాణ పాట నిలిచింది. తెలంగాణ గీతం స్ఫూర్తి నింపిన కవులు, రచయితలను కించపరిచే విధంగా గత పాలకుల చర్యలు ఉన్నాయి’ సీఎం రేవంత్ అన్నారు.
‘పెన్నే కదా మన్ను గప్పితే.. గన్ను అయినట్లు తెలంగాణ పోరాటాలు జరిగాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలనేది అందె శ్రీ, గద్దర్ అన్న లాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం 9 మంది ఉద్యమ కారులను గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీలో వారి కుటుంబాలకు ఇళ్లను నిర్మించి అండగా నిలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమ కారులది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిది. వర్గీకరణ అనేది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా ఉండాలి.. అలాగే సమాజాన్ని ముందుకు నడిపించాలానే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు పెద్ద పీట వేయడమనేది రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకే నిర్ణయాలు తీసుకున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనం.. అలాగే కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న.. కోహినూర్ వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి దివంగత అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







