నారద వర్తమాన సమాచారం
ప్రజల భద్రత – పల్నాడు పోలీస్ వారి బాధ్యత
జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనా దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.– పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ .
హెల్మెట్ ధరించండి – క్షేమంగా ప్రయాణించండి.
పల్నాడు జిల్లా పరిధిలోని జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలు ఈ రోజు నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ, హెల్మెట్ ధరించకపోతే ఎటువంటి ప్రవేశం అనుమతించబడదని ఎస్పీ గారు స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణనష్టం తగ్గింపు, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహన ప్రమాదాలలో ప్రాణనష్టం ఎక్కువగా తలకు గాయాలవడం వల్ల జరుగుతున్న నేపథ్యంలో, హెల్మెట్ వినియోగం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
హెల్మెట్ ధరించడం ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణకు తప్పనిసరి చర్య అని స్పష్టం చేస్తూ,
డ్రైవర్ తో పాటు వెనుక కూర్చునే ప్రయాణికుడు కూడా తప్పనిసరిగా ISI ప్రమాణాలు కలిగిన హెల్మెట్ ధరించి ప్రయాణించాలని సూచించారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. హైవేలు, ప్రధాన రహదారులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా హెల్మెట్ లేకుండా హైవేల పైకి వచ్చే వారిని రాకుండా ఆపి అపరాధ రుసుము విధించి వారిని వెనుకకు పంపడం జరిగింది.
ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట టౌన్, చిలకలూరిపేట రూరల్, రొంపిచర్ల, నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే లపై హెల్మెట్ మీద ప్రత్యేక అమలు చర్యలు నిర్వహించడం జరిగింది.
అంతేకాకుండా, ప్రజల ప్రాణభద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, పల్నాడు జిల్లా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి రోడ్డు భద్రతను కాపాడాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







