Friday, November 22, 2024

అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ అస్త్రమే ఓటుహక్కు!

నారద వర్తమాన సమాచారం

లలితా వెంకటేశ్వర్లు సంకలనం చేసిన ‘భారత రాజ్యాంగం’ గ్రంథం ప్రతులతో వేదికపై సతీష్ చందర్, నిమ్మరాజు తదితరులు

అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ అస్త్రమే ఓటుహక్కు!
పాలకులు ఇది మరిస్తే దండన తప్పదు
రాష్ట్రస్థాయి సదస్సులో ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్

గుంటూరు,

జూలై 13

: చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానులా లేవగల అస్త్రం రాజ్యాంగమనేది ఒకటుందనే విషయాన్ని పాలకులు, ప్రజలు మరువరాదని ప్రముఖ పత్రికా సంపాదకులు సతీష్ చందర్ అన్నారు. బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యాన గోరంట్లలోని డి స్క్వేర్ కన్వెన్షన్ హాల్లో శనివారం ‘రాజ్యాంగమే ప్రతిపక్షమా? (జడ్జిమెంట్ 2024)’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన తొలి సెషన్ ‘లోక్ సభలో సంకీర్ణం రాజ్యాంగ విజయమేనా?’, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ ‘తెలుగు రాష్ట్రాల ఫలితాలలో కుల సమీకరణాలు – కుటుంబ రాజకీయాలు’ అంశాలపై సతీష్ చందర్ ప్రధాన వక్తగా ప్రసంగించారు.
ప్రజలు స్పష్టమైన, తిరుగులేని, బ్రూట్ మెజారిటీలు ఇచ్చి ఆయా పార్టీల నేతలను చట్టసభలకు పంపితే వైరిపక్షాలను చంపేస్తున్నారని ఆయనన్నారు. ప్రతిపక్ష సభ్యులను చిన్నబుచ్చుతున్నారని, ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వారిని అడ్డంగా కొనేస్తున్నారనీ గుర్తుచేశారు. కేంద్రంలో, రాష్ట్రాల్లోనూ ఇదే తంతు సాగుతోందని చెప్పారు. సక్రమంగా పాలించమని ప్రజలు మెజారిటీ ఇస్తే రాజ్యాంగ సంస్థలను కీలుబొమ్మల్ని చేశారని, దర్యాప్తు సంస్థల్ని కుళ్ళబొడిచారని వివిధ సంఘటనల్ని ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ వెన్నువిరిచారని, మీడియా సంస్థల నోళ్ళునొక్కారనీ చెప్పారు. శత్రుపక్ష నేతల్ని జైళ్ళలో వేశారని, అణగారిన వర్గాలను అధఃపాతాళానికి తొక్కేశారన్నారు. రైతులు తమ దీర్ఘకాల సమస్యలపై యేడాదికి మించి దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లపై బైఠాయిస్తే వారిపై ‘ఉగ్రవాద’ ముద్ర వేశారన్నారు. ఆదివాసులు అడవి తమదేనని బహుళజాతి సంస్థల్ని అడ్డుకుంటే ‘తీవ్రవాదులు’గా నిందలు మోపారన్నారు. విద్యార్థులు క్యాంపస్ దాటితే నిరుద్యోగ రాక్షసిని ఉసిగొల్పారని, పొరపాటున పోటీ పరీక్షకు వెళితే ‘పేపర్ లీకు’లతో కుళ్ళబొడిచారని ఆయన ధ్వజమెత్తారు. పాలకులు తాము ఆడిందే ఆట, పాడిందే పాట అని భ్రమించారే కానీ, చరిత్ర నిద్రా సముద్రం నుంచి పెను తుపానుగా లేవగల అస్త్రం రాజ్యాంగం ప్రజల నిర్ణాయక శక్తిగా, సమయం వచ్చినపుడు శాసించే ఓటుహక్కుగా వుందనే విషయాన్ని మరిచారని ఆయన వ్యాఖ్యానించారు. “ఆపద వచ్చినపుడు ప్రయోగించడానికి అంబేడ్కర్ ఈ దేశం వోటరు చేతిలో రాజ్యాంగ ఆయుధం పెట్టారు. కార్పొరేట్ సంస్థలకు సంచులిచ్చి, పేదల ముఖాన పింఛను కొట్టిన నడమంత్రపు నియంతలపై వోటరు ఆ ఆయుధాన్నే ప్రయోగించాడు. అదే 2024 ఎన్నికల తీర్పు” అని సతీష్ చందర్ వివరించారు.
ఈ సందర్భంగా దేవరకొండ లలితా వెంకటేశ్వర్లు సంకలనం చేసిన ‘భారత రాజ్యాంగం’ గ్రంథాన్ని పరిచయం చేశారు. ఈ సదస్సులో సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతిరావు, బ్లూ వింగ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పులి మల్లికార్జునరావు, ప్రధాన సలహాదారు డాక్టర్ శివరామకృష్ణారావు, ప్రధాన సాంకేతిక, న్యాయ సలహాదారు బోడపాటి సుధీర్ కుమార్, పత్రికా-సాంస్కృతిక కార్యదర్శి సిహెచ్ రాజేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading