నారద వర్తమాన సమాచారం
ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్….
దిల్లీ: కేంద్రమంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం బడ్జెట్ సమర్పించనున్న వేళ సోమవారం ఆర్థిక సర్వేను సభ ముందుంచారు. దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా సభలో ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికం 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు ఆర్థికానికి అండగా నిలిచాయి.
దేశంలో ఆర్థిక వ్యవస్థ మున్ముందు వృద్ధిలో ముందుకు దూసుకెళ్లనుంది..
అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రభావితం చేయొచ్చు.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
కార్పొరేట్, బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుంది.
భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్‌లది కీలకపాత్ర. భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిణామాలను తట్టుకోలదని ఆర్థిక సర్వే అభిప్రాయం.
పెరిగిన చైనా ఎఫ్‌డీఐలు ప్రపంచంలో భారత సప్లయ్ చైన్‌లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుంది.
దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టింది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గింది.
ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల రూ.67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో రూ.14వేల కోట్లు కార్యరూపం దాల్చాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.